Rajasthan vs Bengaluru: ఆర్సీబీ ఇంటికి.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫైనల్‌ బెర్త్‌ కోసం రెండో క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌తో రాజస్థాన్‌ తలపడనుంది. 

Updated : 22 May 2024 23:54 IST

అహ్మదాబాద్‌: వరుసగా ఆరు విజయాలు సాధించి అనుహ్యంగా ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎలిమినేటర్ మ్యాచ్‌లో భంగపాటు తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యాన్ని సంజు సేన 6 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. ఆర్‌ఆర్‌ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8 ఫోర్లు), రియాన్‌ పరాగ్ (36; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హెట్‌మయర్ (26; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు. సంజు శాంసన్ (17) పరుగులు చేశాడు. ధ్రువ్‌ జురెల్ (8) సింగిల్‌ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. చివర్లో హెట్‌మయర్, పరాగ్ ఒకే ఓవర్లో ఔటవడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. కానీ, రోమన్ పావెల్ (16*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. శుక్రవారం చెన్నైలో క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్థాన్‌ తలపడనుంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఒక్కరూ కూడా భారీ స్కోరు చేయలేదు. రజత్ పటిదార్‌ (34; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ (33; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), మహిపాల్ లామ్రోర్ (32; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కామెరూన్ గ్రీన్‌ (27), డుప్లెసిస్ (17), దినేశ్‌ కార్తిక్ (11) పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. 

తొలి ఆటగాడిగా విరాట్ రికార్డు 

ఈ మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 8 వేల పరుగుల (8004 రన్స్) మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6769), రోహిత్ శర్మ (6628) ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని