Kolkata X Rajasthan:: నరైన్‌ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్‌ను గెలిపించిన బట్లర్‌

కోల్‌కతాపై రాజస్థాన్‌ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్‌ బట్లర్‌ శతకం(107*)తో చెలరేగాడు. 

Updated : 17 Apr 2024 01:56 IST

కోల్‌తా: ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్‌ అదిరిపోయే విజయం సాధించింది. కోల్‌కతాను తన సొంతగడ్డపైనే 2 వికెట్ల తేడాతో ఓడించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ చివరి బంతికి విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోస్‌ బట్లర్‌ (107*: 60 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) కడదాకా ఉండి శతకంతో తన జట్టును గెలిపించాడు. రియాన్‌ పరాగ్‌ (34: 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోమన్‌ పావెల్‌ (26: 13 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌) చెలరేగారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా, సునిల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీశారు. అరోరాకు ఒక వికెట్‌ పడింది.   

బట్లర్‌ ఒంటరి పోరు..

224 పరుగుల లక్ష్యం అంటే మామూలు విషయం కాదు.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇంతటి లక్ష్యాలను ఛేదించిన సందర్భాలు అరుదు. అంతటి లక్ష్యాన్ని బట్లర్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో కరిగించాడు. కొండంత లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన రాజస్థాన్‌ తొలుత ధాటిగానే మొదలుపెట్టింది. అయితే దూకుడుగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్‌ (19: 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రెండో ఓవర్‌ ఐదో బంతికి అరోరాకు చిక్కాడు. 4.2 ఓవర్ల వద్ద శాంసన్‌ (12: 8 బంతుల్లో) హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులతో నిలిచిన రాజస్థాన్‌.. పరాగ్‌ రాకతో ఒక్కసారిగా వేగం పుంజుకుంది. వైభవ్‌ వేసిన ఆరో ఓవర్‌లో పరాగ్‌, బట్లర్‌ మొత్తం 23 పరుగులు పిండుకున్నారు. పరాగ్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌, బట్లర్‌ ఒక సిక్స్‌ కొట్టాడు. దూకుడుగా ఆడుతున్న పరాగ్‌ 8వ ఓవర్‌ ఐదో బంతికి హర్షిత్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్వల్ప తేడాతో నరైన్‌ బౌలింగ్‌లో ధ్రువ్‌ జురెల్‌ ఎల్బీగా వెనుదిరగడంతో రాజస్థాన్‌ కష్టాల్లో పడింది. 12 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 121 పరుగులతో నిలిచిన రాజస్థాన్‌కు.. 13వ ఓవర్‌లో భారీ షాక్‌ తగిలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వరుస బంతుల్లో అశ్విన్‌ (8)ను, హిట్టర్‌ హెట్‌మయర్‌(0)ను ఔట్‌ చేశాడు. దీంతో స్కోర్‌ బాగా నెమ్మదించింది. రాజస్థాన్‌ భారీ తేడాతో ఓటమి తప్పదనుకున్నారు అంతా. 14 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 నిలిచిన సంజు సేన.. చివరి 6 ఓవర్లలో 98 చేయాలి. ఆ సమయంలో క్రీజులో పావెల్‌, బట్లర్‌ ఉన్నప్పటికీ లక్ష్యం భారీగా ఉండడంతో రాజస్థాన్‌ గెలుపుపై నమ్మాకాలు లేవు.

అయితే 15వ ఓవర్‌లో బట్లర్‌ గేర్‌ మార్చి విశ్వరూపం చూపాడు. వరుసగా రెండు ఫోర్లు బాది అర్ధశతకం చేసిన అతడు.. అదేఓవర్‌ మరో రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లోనూ పావెల్‌, బట్లర్‌ చెరో సిక్స్‌ కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక 17వ ఓవర్‌లో పావెల్‌ ఒక్కసారిగా చెలరేగాడు. నరైన్‌ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్‌, రెండు, మూడు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దీంతో రాజస్థాన్‌ శిబిరంలో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. అయితే ఐదో బంతికి పావెల్‌ ఎల్బీగా ఔటకావడంతో అంతా నిరుత్సాహానికి గురయ్యారు. ఇక క్రీజులో ఉంది బట్లర్‌ మినహా బ్యాటర్లు లేరు. ఇరు జట్లలోనూ ఉత్కంఠ చెలరేగింది. అయితే ఒత్తిడిని చిత్తుచేస్తూ బట్లర్‌ 18వ ఓవర్‌లో దూకుడుగా ఆడాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. విజయ సమీకరణం 12 బంతుల్లో 28 పరుగులుగా మారింది. 19 ఓవర్‌లో 19 పరుగులు రావడంతో చివరి ఓవర్‌లో లక్ష్యం 9 పరుగులుగా ఉంది. తొలి బంతికి బట్లర్‌ సిక్స్‌ కొట్టగా, వరుసగా మూడు బంతులకు పరుగులు రాకపోవడంతో స్టేడియంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజస్థాన్‌ విజయం సాధించాలంటే 2 బంతుల్లో 3 పరుగులు చేయాలి. స్ట్రైకింగ్‌లో ఉన్న బట్లర్‌ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో స్కోర్‌ సమమైంది. ఇరు జట్లలోనూ నిశ్శబ్దం ఆవరించింది. అయితే బట్లర్‌ చివరి బంతికి పరుగు చేసి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.   

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. సునిల్‌ నరైన్‌ (109: 56 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. రఘువంశీ (30: 18 బంతుల్లో 5 ఫోర్లు), రింకు సింగ్‌ (20) పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 2, కుల్దీప్‌ సేన్‌ 2, బౌల్ట్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని