Mumbai vs Rajasthan: ఖాతా తెరవని ముంబయి.. హ్యాట్రిక్‌ కొట్టిన రాజస్థాన్‌

ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టింది. ఈ ఐపీఎల్‌లో ముంబయి ఇంకా ఖాతా తెరవలేదు. 

Updated : 01 Apr 2024 23:28 IST

ముంబయి: ఐపీఎల్‌ 2024లో ముంబయి (Mumbai)ని ఓటమి కష్టాలు వీడటం లేదు. రాజస్థాన్‌ (Rajasthan)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఇంత వరకు గెలుపు రుచి చూడకపోగా, రాజస్థాన్‌ వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌.. హార్దిక్‌ సేనను 125 పరుగులకే కట్టడి చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (3/22), యుజ్వేంద్ర చాహల్‌ (3/11), బర్గర్‌ (2/32) ఆ జట్టు పతనాన్ని శాసించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాన్‌ పరాగ్ (54*; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. యశస్వి జైస్వాల్ (10), జోస్ బట్లర్ (13), సంజు శాంసన్ (12), రవిచంద్రన్ అశ్విన్ (16), శుభమ్‌ దూబె (8*) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో ఆకాశ్‌ మధ్వాల్‌ (3/20) ఆకట్టుకోగా.. క్వెనా మఫాకా ఒక వికెట్ తీశాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. ట్రెంట్ బౌల్ట్ టాప్‌ ఆర్డర్ పనిపట్టగా.. యుజువేంద్ర చాహల్ మిడిల్‌ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ముంబయి బ్యాటర్లలో రోహిత్ శర్మ (0), నమన్ ధిర్‌ (0), డెవాల్డ్ బ్రెవిస్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరారు. ఈ ముగ్గురూ బౌల్ట్ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. ఇషాన్ కిషన్‌ (16)ను బర్గర్ వెనక్కి పంపడంతో ముంబయి 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ (32; 29 బంతుల్లో 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (34; 21 బంతుల్లో 6 ఫోర్లు) ముంబయిని ఆదుకున్నారు. చివర్లో టిమ్ డేవిడ్ (17; 24 బంతుల్లో) ధాటిగా ఆడలేకపోయాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా (8*), ఆకాశ్‌ మధ్వల్ (4*) జాగ్రత్తగా ఆడటంతో ముంబయి ఆలౌట్‌ నుంచి తప్పించుకుంది.

మ్యాచ్‌ విశేషాలు

  • రాజస్థాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కిది 200వ ఐపీఎల్ మ్యాచ్‌. 
  • మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన రాజస్థాన్ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్ ఇప్పటివరకు అత్యధిక పరుగులు (181) చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.  
  • ముంబయి కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యకు తొలి మూడు మ్యాచ్‌ల్లో పరాభవం ఎదురుకాగా.. గుజరాత్ సారథిగా మొదటి మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని