IND vs ENG: రాంచీ టెస్టు.. భారత్‌ బౌలింగ్‌ వ్యూహమేంటి?

ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ రాంచీ వేదికగా జరగనుంది. ప్రస్తుతం భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.

Published : 23 Feb 2024 02:15 IST

ఇంటర్నెట్ డెస్క్: రాంచీ మైదానం వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పర్యటక జట్టు ఫైనల్‌ XIను ప్రకటించింది. పిచ్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు ఇబ్బందిపడుతున్న తరుణంలో.. టీమ్‌ఇండియా ఎలా బరిలోకి దిగుతుందా? అని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సీనియర్‌ పేసర్ బుమ్రా లేకుండానే భారత్ ఈ మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. 

భారత్‌ మైదానాలు ఎక్కువగా టర్నింగ్‌ పిచ్‌లను కలిగిఉంటాయి. ఇక్కడికి వచ్చే ప్రత్యర్థులు సైతం అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతాయి. కానీ, ఇంగ్లాండ్‌ మాత్రం ఇద్దరు స్పెషలిస్టులతోనే నెట్టుకొస్తోంది. టీమ్‌ఇండియా మాత్రం కనీసం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఇప్పుడు రాంచీలోనూ తొలి రోజు మినహా మొత్తం మ్యాచ్‌లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ ఇంగ్లాండ్‌ ఇద్దరు స్పెషలిస్ట్‌ + ఒక పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌తో కూడిన జట్టును ప్రకటించింది.  భారత్‌ మాత్రం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులో ముగ్గురు బ్యాటింగ్‌ చేయగలగడం టీమ్‌ఇండియాకే బలం. 

నలుగురా..? ముగ్గురా?

భారత స్క్వాడ్‌లో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. అందరూ స్పిన్‌ వేసేవారే. బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగలరు. ఇక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నాడు. అతడు   గత మ్యాచ్‌లో విలువైన పరుగులూ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే మాత్రం.. అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ పక్కాగా ఉంటారు. నాలుగో బౌలర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్ పటేల్ రేసులో నిలుస్తారు. ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లే. కానీ, సుందర్ కుడిచేతి బౌలర్‌ కావడం విశేషం. అయితే, అక్షర్ పటేల్ రెండు టెస్టులు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. సుందర్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సివచ్చింది. పేస్‌ బౌలర్లలో సిరాజ్‌ స్థానం ఫిక్స్‌ అయిపోయింది. రెండో బౌలర్‌ను తీసుకుంటారా..? నాలుగో స్పిన్నర్‌ను ఎంచుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజమే. అయితే, ఆకాశ్ దీప్‌ అరంగేట్రం ఖాయమనే వార్తలూ వస్తున్నాయి. దీంతో ముగ్గురు స్పిన్నర్లు + ఇద్దరు పేసర్లతోనే తుది జట్టు ఉంటుందని తెలుస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌కు ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. రజత్‌ మినహా అందరూ రాణిస్తున్నారు. మరోసారి అతడికి అవకాశం ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్ ఆసక్తిగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని