Cricket News: సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన ముషీర్‌ ఖాన్‌.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు

రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి ఆటగాడు ముషీర్‌ఖాన్ సెంచరీ బాదాడు. టీమ్‌ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ ఐసీసీ అవార్డును గెల్చుకున్నాడు.  

Updated : 12 Mar 2024 17:27 IST

ముంబయి: ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ముషీర్‌ఖాన్‌.. కీలకమైన ఫైనల్‌లోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులే చేసి నిరాశపరిచిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 326 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. ఈక్రమంలోనే సచిన్‌ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్‌ చేశాడు. 19 ఏళ్లు ముషీర్‌ఖాన్‌ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో శతకం బాదిన పిన్నవయసు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సచిన్‌ 22 ఏళ్ల వయసులో 1994/95 సీజన్‌ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో కదం తొక్కాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 140, రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగులు చేసి ముంబయి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 


యశస్వికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డు

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు. 712 పరుగులు చేసి ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో అత్యధిక రన్స్‌ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సునీల్ గావస్కర్‌ తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఇండియన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సంచలన ఆట తీరుతో యశస్వి ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు విజేతగా నిలిచాడు. కేన్‌ విలియమ్సన్‌, పాథుమ్‌ నిశాంక్‌లను వెనక్కినెట్టి ఈ అవార్డు అందుకున్నాడు. ‘‘ఐసీసీ అవార్డును సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో నేను మరిన్ని అవార్డులు అందుకుంటానని ఆశిస్తున్నాను. నా కెరీర్‌లో అత్యుత్తమమైన సిరీస్‌లో ఇది ఒకటి. నా మొదటి ఐదు మ్యాచ్‌ల సిరీస్ కూడా ఇదే.  మేం 4-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకున్నాం. ఇది నా సహచరులందరికీ అద్భుతమైన అనుభవం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని