BCCI Contracts: ఆ ఇద్దరు బలంగా తిరిగివస్తారు: రవిశాస్త్రి

బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఇద్దరిని తప్పించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మేనేజ్‌మెంట్ ఆదేశాలను లెక్క చేయకపోవడం వల్లే ఇదంతా చోటు చేసుకుంది. 

Updated : 29 Feb 2024 10:41 IST

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను దక్కించుకోవడంలో ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడం వల్లే వారికి అవకాశం కల్పించలేదు. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ట్విటర్ వేదికగా అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘‘క్రికెట్‌లో ఇలాంటవన్నీ సహజమే. స్ఫూర్తితో పునరాగమనం చేయాలి. శ్రేయస్‌, ఇషాన్‌ బాధపడొద్దు. జాతీయ జట్టులోకి ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడు మరింత బలంగా పుంజుకోవాలి. గతంలో సాధించిన లక్ష్యాలు విలువల గురించి చెబుతాయి. మీరు మళ్లీ పైకి ఎదుగుతారనే నమ్మకం నాకుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

విభిన్నంగా స్పందించిన నెటిజన్లు 

యువ క్రికెటర్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చిన బీసీసీఐ.. శ్రేయస్‌, ఇషాన్‌తోపాటు పుజారా, రహానె, శిఖర్ ధావన్, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌కూ అవకాశం దక్కలేదు. శ్రేయస్‌, ఇషాన్‌ దేశవాళీలో ఆడకపోవడం వల్లే ఇవ్వలేదని వాదనపై సోషల్‌ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పించారు. బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని కామెంట్లు చేశారు. 

‘‘రంజీ మ్యాచ్‌లనే పక్కన పెట్టేసిన హార్దిక్‌ పాండ్యకు కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్‌ మాత్రం కేవలం ఒక్క మ్యాచ్‌ను మిస్‌ అయినందుకే తొలగించడం అన్యాయం’’

‘‘ప్రపంచ కప్‌లో 10 మ్యాచులకుగాను 500+ స్కోరు చేసిన ఆటగాడికి కాంట్రాక్ట్‌ ఇవ్వలేదు. శ్రేయస్‌కు ఇది కష్టకాలం. మేమంతా అతడికి మద్దతుగా ఉంటాం. తప్పకుండా తిరిగి వస్తాడు’’

‘‘రంజీ మ్యాచ్‌లను ఆడకుండా ఉండిపోయిన ఆటగాళ్లు ఇషాన్‌, శ్రేయస్‌ మాత్రమే కాదు. మిగతా టాప్‌ ప్లేయర్లది ఇదే దారి. ఇదంతా ఓ డ్రామాలా ఉంది. వెన్ను నొప్పి, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినప్పుడు బీసీసీఐ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు’’

‘‘కుల్‌దీప్‌ను ఏ గ్రేడ్‌, హార్దిక్‌ పాండ్యను బి గ్రేడ్, రిషభ్‌ పంత్‌ అంతర్జాతీయ జట్టులోకి వచ్చే వరకు గ్రేడ్‌ ‘సి’లో ఉంచితే బాగుండేది. పంత్‌ కుదురుకున్నాక అప్‌గ్రేడ్‌ చేయాల్సింది. శ్రేయస్, ఇషాన్‌ను పక్కన పెట్టడం సరైంది కాదు. వారికి అవకాశం ఇస్తే బాగుండేది’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని