Ashwin For ODI WC 2023: అశ్విన్ వన్డే వరల్డ్‌ కప్‌ ఆడతాడా..? రోహిత్ సమాధానంతో కొత్త చర్చ!

ఆసియా కప్‌లో ఆడిన అక్షర్ బంగ్లాతో మ్యాచ్‌లో గాయపడ్డాడు. మెగా టోర్నీ నాటికి కోలుకుని వస్తాడా..? లేదా..? అనేది అనుమానంగా మారింది. ఈ క్రమంలో అశ్విన్‌కు అవకాశం లభిస్తుందనే వాదనా మరో వైపు ఉంది. వరల్డ్‌ కప్‌ కోసం జట్టులో ఏమైనా మార్పులు చేసుకోవడానికి కాస్త సమయం ఉంది.

Published : 18 Sep 2023 13:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్ (Asia Cup 2023) విజేతగా నిలిచిన భారత్‌ ఇక మెగా టోర్నీ వరల్డ్ కప్‌ (ODI WC 2023) కోసం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఆలోగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఆడనుంది. ఇప్పటికే ఆసీస్‌ తమ స్క్వాడ్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఆసియా కప్‌ సూపర్ -4లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆసియా కప్ ఫైనల్‌కు తీసుకున్నారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌తోపాటు వరల్డ్‌ కప్‌లో అక్షర్ పటేల్ ఆడతాడా? అనేది అనుమానస్పదంగానే ఉంది. ఈ క్రమంలో మరో సీనియర్‌ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) జట్టులోకి వస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం కూడా మరోసారి చర్చకు దారితీసింది. 

‘‘స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా అశ్విన్‌ ఎప్పుడూ మా దృష్టిలో ఉంటాడు. అతడితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నా, బంగ్లాతో మ్యాచ్‌ ముగింపు సమయంలో అక్షర్‌ పటేల్‌కు గాయమైంది. వాషింగ్టన్ సుందర్ అప్పటికే సిద్ధంగా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. ఇలా సుందర్‌ను తీసుకోవడం వల్ల అతడికి ఆసియా గేమ్స్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు అవకాశం లభించినట్లు అవుతుంది. ఇప్పటికే అతడు ఆసియా గేమ్స్‌ కోసం నిర్వహిస్తున్న క్యాంప్‌లో ఉండటంతో వెంటనే కొలంబోకు పిలిపించాం’’ అని రోహిత్ తెలిపాడు. 

సిరాజ్‌తో ఏడు ఓవర్లే వేయించడానికి కారణమదే: రోహిత్ శర్మ

వాషింగ్టన్ సుందర్‌ అక్టోబర్‌లోనే జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొంటాడు. మరోవైపు అక్షర్ పటేల్‌ కోలుకోకపోతే మాత్రం సీనియర్ స్పిన్‌ ఆల్‌రౌండర్ అయిన అశ్విన్‌ను ఎంచుకొనేందుకు అవకాశాలు పుష్కలం. వరల్డ్ కప్‌ భారత్‌లోనే కాబట్టి ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అశ్విన్‌ మరింత ప్రభావం చూపిస్తాడనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని