Siraj in IND vs SL: సిరాజ్‌తో ఏడు ఓవర్లే వేయించడానికి కారణమదే: రోహిత్ శర్మ

అప్పటి వరకు టోర్నీలో ఒకటీ అరా వికెట్లు తీసిన సిరాజ్‌ (Siraj).. ఆసియా కప్‌ ఫైనల్‌లో (Asia Cup 2023) మాత్రం చెలరేగిపోయాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు.

Published : 18 Sep 2023 10:21 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (Siraj) ఆసియా కప్‌ ఫైనల్‌లో దుమ్ముదులిపేశాడు. శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్‌ కావడంలో ఈ హైదరాబాదీ పేసర్ కీలక పాత్ర పోషించాడు. ఔట్‌, ఇన్‌ స్వింగ్‌ బౌలింగ్‌తో లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ (6/21) బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేయడమే కాకుండా ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అయితే, సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో కేవలం ఏడు ఓవర్లను మాత్రమే విసిరాడు. మిగిలిన ఓవర్లను కూడా వేయించి ఉంటే తప్పకుండా మరికొన్ని వికెట్లను తన ఖాతాలో వేసుకొనేవాడనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఊపు మీదున్న ఇలాంటి పేసర్‌కు ఆ తర్వాత ఎందుకు బౌలింగ్‌ ఇవ్వలేదనే దానిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 

‘‘పేస్‌ బౌలింగ్‌ను చూసి నేను చాలా ఆనంద పడ్డా. ఇలాంటి ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించడం అద్భుతం. ప్రతి కెప్టెన్‌కూ ఇలాంటి అనుభవమే కలుగుతుంది. కాబట్టి, నేను వారికి భిన్నమేమీ కాదు. మనకు అద్భుతమైన పేస్‌ దళం ఉంది. ప్రతి ఒక్కరిలో విభిన్నమై బౌలింగ్‌ శైలి, నైపుణ్యాలు ఉన్నాయి. ఒకరు వేగంగా బంతులను సంధిస్తే.. మరొకరు స్వింగ్‌ చేస్తారు. అలాగే ఇంకొకరు బౌన్స్‌ రాబడతారు. ఇలాంటివారందరూ ఒకే జట్టులో ఉంటే ఆ అనుభూతి అద్భుతమనిపిస్తుంది. 

Mohammed Siraj: సి‘రాజసం’!

సిరాజ్‌లో ఇలాంటి లక్షణాలు అన్నీ ఉండటం విశేషం. స్వింగ్‌, పేస్, బౌన్స్ వేయగలడు. అతడి ఏడు ఓవర్ల స్పెల్‌లో వీటన్నింటినీ చూశాం. స్లిప్‌లో ఉండి సిరాజ్‌ బౌలింగ్‌ను చూడటం సంతోషంగా అనిపించింది. సిరాజ్‌ ఏడు ఓవర్ల స్పెల్‌ను నిర్విరామంగా వేశాడు. దీంతో అతడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్‌ నుంచి సందేశం వచ్చింది. దీంతో రెస్ట్‌ ఇచ్చి స్పిన్నర్‌తో పాటు హార్దిక్‌తో కంటిన్యూ చేయించా. అయితే, హార్దిక్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి వికెట్లను తీయడంతో మళ్లీ సిరాజ్‌కు అవకాశం రాలేదు. గతంలో త్రివేండ్రం (తిరువనంతపురం)లోనూ వరుసగా 8-9 ఓవర్లు వేశాడు. వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో మరీ ఒత్తిడి ఎక్కువ లేకుండా ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్‌ టోర్నీగా నిలిచిన కుల్‌దీప్‌ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని