Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్‌ అభిమానులు సుడిగాడు అంటున్నారు!

రవిచంద్రన్‌ అశ్విన్‌ను సుడిగాడు అంటున్నారు భారత క్రికెట్‌ అభిమానులు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎప్పుడో ముగిసిందనుకున్న అతడి కెరీర్‌.. మళ్లీ ఊపందుకుని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచకప్‌ ఆడేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Published : 30 Sep 2023 01:54 IST

ఈసారి వన్డే ప్రపంచకప్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడతాడని రెండు వారాల ముందు ఎవరైనా అంటే నవ్వేవాళ్లు. కానీ అతను అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో అతను ఆడటం కూడా అనూహ్యమే.

కెరీర్‌లో కొన్నేళ్లు మూడు ఫార్మాట్లలోనూ కీలక బౌలర్‌గా ఉన్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. కానీ ఒక దశ దాటాక అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్లో తిప్పలు తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్‌స్పిన్నర్లకు కాలం చెల్లింది. టీ20ల్లో బ్యాటర్ల విధ్వంసం పెరిగాక.. లెగ్‌స్పిన్నర్లకే జట్లు పెద్ద పీట వేశాయి. ఆఫ్‌స్పిన్నర్ల బౌలింగ్‌ను అలవోకగా ఆడేస్తుండటంతో అన్ని జట్లూ వారిని పక్కన పెట్టేయడం మొదలైంది. ఈ క్రమంలోనే అశ్విన్‌ 2017లో భారత టీ20 జట్టుకు దూరమయ్యాడు. నాలుగేళ్ల పాటు జట్టు ఛాయల్లోకే అతను రాలేదు. ఇక మళ్లీ అశ్విన్‌ను టీ20 జట్టులో చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు. కానీ 2021 టీ20 ప్రపంచకప్‌కు అనుకోకుండా జట్టులో చోటు సంపాదించాడు అశ్విన్‌. యూఏఈలో జరిగిన ఆ ప్రపంచకప్‌లో జడేజా, కుల్‌దీప్‌లతో పాటు అశ్విన్‌కూ అవకాశం దక్కింది.

ఫామ్‌లో ఉన్న చాహల్‌ను పక్కన పెట్టి మరీ అశ్విన్‌కు అప్పుడు జట్టులో చోటిచ్చారు. అశ్విన్‌ ఆ టోర్నీలో ఏమంత గొప్పగా బౌలింగ్‌ చేయలేదు. దీంతో ఆ టోర్నీ తర్వాత వేటు పడింది. ఇక మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కదనే అంతా అనుకున్నారు. కానీ గత ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు గాయం వల్ల జడేజా అందుబాటులో లేకుండా పోవడం, కుల్‌దీప్‌ ఫామ్‌ కోల్పోవడంతో అవకాశం అశ్విన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ముందు కొన్ని మ్యాచ్‌ల్లో ఆడించి.. తర్వాత ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు. అందులో ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు అశ్విన్‌.

నెల ముందు అలా..

ఇక ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో అశ్విన్‌ ఆడబోతుండటం మాత్రం మిరాకిల్‌ అనే చెప్పాలి. ఏడాదిన్నర నుంచి అతడికి వన్డే జట్టులో చోటే లేదు. ఈ ఫార్మాట్‌ నుంచి అతను దాదాపుగా రిటైరైనట్లే భావించారు అంతా. అధికారికంగా ప్రకటన మాత్రమే చేయలేదు. నెల ముందు ప్రపంచకప్‌నకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై యూట్యూబ్‌లో విశ్లేషణ చేస్తూ కనిపించాడు అశ్విన్‌. తిలక్‌ వర్మకు చోటివ్వాలని డిమాండ్‌ కూడా చేశాడు. అలాంటివాడు ప్రపంచకప్‌ రేసులోకి రావడం అనూహ్యం. ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ గాయపడటం అశ్విన్‌కు వరంగా మారింది. గాయం తీవ్రత ఎక్కువే కావడంతో అత్యవసరంగా ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం పడింది సెలక్టర్లకు. వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు అశ్విన్‌నూ ఎంపిక చేశారు.

అయితే అశ్విన్‌ అనుభవానికే పెద్ద పీట వేస్తూ ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో అతణ్నే ఆడించింది జట్టు యాజమాన్యం. తొలి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ తీసిన అతను.. రెండో వన్డేలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై విజృంభించాడు. మూడు వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. లబుషేన్‌ను బౌల్డ్‌ చేసిన తీరుతో అశ్విన్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అక్షర్‌ మూడో వన్డే సమయానికి కూడా కోలుకోకపోవడంతో అశ్విన్‌ను అవకాశం వరించింది. రెండు వారాల ముందు జట్టు ప్రణాళికల్లోనే లేని వాడు ఇప్పుడు ప్రపంచకప్‌ ఆడబోతున్నాడు. ముందు ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన ముగ్గురు స్పిన్నర్లూ ఎడమ చేతి వాటం బౌలర్లే కాగా.. అక్షర్‌ బదులు కుడిచేతి వాటం బౌలరైన అశ్విన్‌ రావడంతో బౌలింగ్‌కు వైవిధ్యం చేకూరుతోంది. మంచి లయలో కనిపిస్తున్న అశ్విన్‌.. తన అనుభవాన్ని సరిగ్గా ఉపయోగిస్తే జట్టుకు పెద్ద బలమవుతాడనడంలో సందేహం లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని