Ashwin- WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడకపోవడంపై అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final 2023) అశ్విన్‌ ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. అశ్విన్‌ కూడా అప్పుడే స్పందించాడు. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Published : 13 Jul 2023 14:48 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో (WI vs IND) జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. కెరీర్‌లో 33వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో విండీస్‌ 150 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. నెల రోజుల కిందట ఆసీస్‌తో జరిగిన  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడే అవకాశం అశ్విన్‌కు రాలేదు. అప్పుడే ఆ అంశంపై అశ్విన్‌ స్పందించాడు. తాజాగా మరోసారి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘నేను ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి స్పందించాను. కీలకమైన మ్యాచ్‌కు పక్కన కూర్చోవడం ఎలాంటి క్రికెటర్‌కైనా కష్టంగానే ఉంటుంది. అయితే, ఇతరులకు నాకు మధ్య ఓ తేడా ఉంది. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లకపోవడం, ఆటగాళ్లకు దూరంగా  ఉండటం వంటివి చేయలేదు. మేం డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు మానసికంగానూ సిద్ధమై ఉన్నా. ఫిట్‌నెస్‌పరంగానూ ప్రిపేర్డ్‌గా ఉన్నా. మ్యాచ్‌లో ఎలా ఆడాలి.. ఎలా బౌలింగ్‌ చేయాలనేదాని గురించి ఆలోచించా. ఇదే సమయంలో మ్యాచ్‌లో నేను ఆడలేకపోతే అన్నదానికీ సిద్ధమయ్యా. టీమ్‌ఇండియా కోసం సర్వశక్తులూ వడ్డేందుకు ఎప్పుడూ రెడీ ఉంటా. సహచరులతో కలిసి ఆడేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. కాబట్టే ఆ విషయాన్ని అప్పుడే వదిలేశా’’ అని అశ్విన్‌ వివరించాడు. 

వికెట్‌ నుంచి పూర్తి సహకారం

డొమినికా పిచ్‌ నుంచి బౌలింగ్‌కు పూర్తి సహకారం అందిందని అశ్విన్‌  తెలిపాడు. ‘‘వికెట్‌ నుంచి కొంత బౌన్స్‌ కలిసొచ్చింది. పెవిలియన్‌ ఎండ్‌ నుంచైతే బౌలర్లకు సహకారం లభించింది. తొలి సెషన్‌లోనే మేం బాగా వినియోగించుకున్నాం. తొలుత కాస్త తేమగా అనిపించినప్పటికీ స్పిన్‌కు అనుకూలంగా మారింది’’ అని చెప్పాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని