Ravindra Jadeja: అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా

ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు.

Updated : 29 Mar 2024 13:13 IST

ఇంటర్నెట్ డెస్క్: గత ఐపీఎల్‌ సీజన్‌ విజేతగా చెన్నైను నిలపడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌పై ఫైనల్‌ చివరి ఓవర్‌లో జడ్డూ బౌండరీలు బాది జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ సందర్భంగా జడేజాను ధోనీ (MS Dhoni) ఆలింగనం చేసుకొని.. పైకి ఎత్తుకొన్నాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గత జ్ఞాపకాలను జడేజా (Ravindra Jadeja) గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ క్రికెట్ జీవితంలో గత సీజన్‌ గుర్తుండిపోతుందని.. ఛాంపియన్‌గా ఐదోసారి టైటిల్‌ను అందుకోవడం చిరస్మరణీయమని పేర్కొన్నాడు. ‘‘సాక్షి (ధోనీ భార్య) వదిన తర్వాత ‘కెప్టెన్ కూల్’ ఎత్తుకొన్న ఏకైక వ్యక్తిని నేనే అయి ఉంటాను’’ అని సరదాగా జడేజా వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. గత సీజన్‌ ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత ‘ఈ కప్‌ కేవలం ధోనీ కోసమే’నంటూ జడేజా వ్యాఖ్యలు చేశాడు.

ధోనీని మించిన కెప్టెన్‌ మరెవరూ లేరు: స్మిత్

‘‘భారత్‌లో ధోనీని మించిన అద్భుతమైన కెప్టెన్ మరొకరు ఉండరు. ఇప్పటికీ స్టంప్స్‌ వెనుక చురుగ్గా ఉండటం అభినందనీయం. ఆటను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటాడు. అతడితో కలిసి ఆడటం అనిర్వచనీయం. మైదానంలోనూ, ఆవల అతడితో ప్రయాణం ఆస్వాదించా. ఎప్పుడూ కూల్‌గా ఉండే అతడు కేవలం క్రికెట్‌తోనే కాకుండా ఇతర విషయాల్లోనూ బిజీగా ఉంటాడు. ధోనీ అద్భుతమని చెప్పడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అతడితో కలిసి ఆడాను. ధోనీని లీడ్‌ చేయడమూ బాగుంది. వ్యక్తిగతంగా నాకెంతో మద్దతుగా నిలిచాడు’’ అని ఆసీస్‌ సీనియర్‌ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) వెల్లడించాడు. ధోనీతో కలిసి స్మిత్ ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టులో ఆడాడు. ఒక సీజన్‌లో (2017) పుణెకి స్మిత్ సారథిగా వ్యవహరించాడు. ఆ ఎడిషన్‌లో పుణె రన్నరప్‌గా నిలవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని