Ambati Rayudu: నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు

ముంబయి ఇండియన్స్‌ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్‌గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. 

Published : 25 Apr 2024 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్‌లో చెన్నై, ముంబయి జట్లలో ఉండే సంస్కృతిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రెండు ఫ్రాంచైజీల తరఫున రాయుడు ఆడిన సంగతి తెలిసిందే. ‘ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది’ అని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో అంబటి రాయుడు వాటిపై వివరణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. 

‘‘ముంబయి గురించి నేను చేసిన కామెంట్లు పక్కదారి పట్టినట్లు అనిపించింది. ముంబయి ఫ్రాంచైజీ నడుచుకునే విధానం విభిన్నంగా ఉంటుందని మాత్రమే చెప్పా. పాజిటివ్‌ ఒత్తిడితో ఆటగాళ్లను తయారుచేయడంలో ఆ జట్టు కీలకంగా మారంది. భారత జట్టుకు అద్భుతమైన క్రికెటర్లు అక్కడినుంచీ ఉన్నారు. నేను ఎనిమిదేళ్లపాటు ముంబయి ఇండియన్స్‌తో ప్రయాణించా. ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతుంటా’’ అని ఎక్స్‌లో పోస్టు చేశాడు.

గతంలో ఏమన్నాడంటే?

‘‘ఫలితాల్ని చెన్నై ఎక్కువగా విశ్లేషించదు. ప్రక్రియపై దృష్టిసారిస్తుంది. ఫలితాలపై మానసికంగా ఆందోళన చెందదు. ఈవిషయంలో ముంబయి పూర్తిగా భిన్నం. గెలుపే ఆ జట్టు లక్ష్యం. ముంబయి సంస్కృతి విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా గెలవాల్సిందే.. ఆ విషయంలో రాజీపడొద్దని అనుకుంటుంది. చెన్నై, ముంబయి జట్ల సంస్కృతి పూర్తిగా భిన్నం. కానీ రెండు జట్లు బాగా కష్టపడతాయి. చెన్నై జట్టులో కాస్త మెరుగైన వాతావరణం ఉంటుందన్నది నా అభిప్రాయం. అక్కడ సుదీర్ఘకాలం ఆడొచ్చు. ముంబయి జట్టుకు ఎక్కువకాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది.

అసలా రోజు కామెంటరీ చేయలేదు..

లఖ్‌నవూతో సొంత మైదానంలో భారీ స్కోరు చేసినా ఓడిపోవడానికి కెప్టెన్ రుతురాజ్‌ పేలవ సారథ్యమే కారణమని రాయుడు విమర్శలు చేశాడని వార్తలు వచ్చాయి. దీంతో రాయుడికి భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌ సిద్ధూ కౌంటర్ ఇస్తూ.. ‘‘చెన్నై విజయాల్లో ధోనీకి క్రెడిట్‌ ఇస్తున్నప్పుడు.. ఆ జట్టు ఓటములకు కూడా అతడిని బాధ్యుడిని చేయడంలో తప్పేం లేదు. ఇప్పటికీ సీఎస్కేలో ప్రధాన పాత్ర ధోనీదే’’ అని వ్యాఖ్యాంచినట్లు రూమర్లు వచ్చాయి. వీటిపై రాయుడు క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఆ రోజు నేనేమీ కామెంటేటరీ చేయలేదు. నా తోటలో మామిడి కాయలు కోసుకుంటున్నా. దయచేసి ఇలాంటివి ప్రచురించే ముందు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. అబద్ధాలను ప్రచారం చేయొద్దు’’ అని స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని