IPL 2024: ‘ఈ సాలా కప్‌ ఆర్సీబీదే’.. అంటున్న టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్

ఐపీఎల్‌-2024 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఛాంపియన్‌గా నిలుస్తుందని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. 

Published : 10 Mar 2024 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ ముగిసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల చూపు ఐపీఎల్‌-2024 (IPL 2024)పై పడింది. మార్చి 22 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు తమ జట్లతో కలిసి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. స్టార్‌ ఆటగాళ్లు, కోట్లాది అభిమానగణం ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. ఈ సీజన్‌తో ఆర్సీబీ (RCB) టైటిల్‌ కల నెరవేరుతుందని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) జోస్యం చెప్పాడు. ఓ క్రీడా ఛానల్‌లో ఆ జట్టు గురించి మాట్లాడాడు.

‘‘గతంలో కంటే ఈ సారి బెంగళూరు బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. బౌలింగ్‌ విభాగం కూడా అద్భుతంగా ఉంది. చిన్నస్వామి వంటి ప్లాట్‌ పిచ్‌లపై ఎక్స్‌ప్రెస్‌ వేగంతో బౌలింగ్‌ చేసే బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇలాంటి పిచ్‌లపై నిలకడగా 140 కి.మీ.కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేస్తే అది కొన్నిసార్లు జట్టుకు ఉపకరిస్తుంది. ఈ సారి బెంగళూరు టైటిల్‌ గెలుస్తుందని భావిస్తున్నా. అదే జరిగితే విరాట్ కోహ్లీకి ఇది చాలా స్పెషల్ మూమెంట్. ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడాలని అతడు 2008 నుంచి ఎదురుచూస్తున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్‌ పేర్కొన్నాడు. మార్చి 22న జరిగే ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని