RCB vs CSK: ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్‌కు వర్షం ముప్పు

మే 18న చెన్నై, ఆర్సీబీ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. 

Updated : 15 May 2024 19:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 17 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. అయినా, ఇప్పటివరకు రెండు జట్లు (కోల్‌కతా, రాజస్థాన్) మాత్రమే ప్లేఆఫ్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. దిల్లీ, లఖ్‌నవూ నాకౌట్‌ చేరడం దాదాపు అసాధ్యమే. మే 18న చెన్నై, ఆర్సీబీ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు చాలా కీలకం. ముఖ్యంగా ఆర్సీబీకి ఇది చావోరేవో లాంటిది. ఇందులో ఆ జట్టు ఓడితే ప్లేఆఫ్స్‌కు చేరదు. గెలిస్తేనే అవకాశం ఉంటుంది. ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. 

మ్యాచ్‌ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్‌ నివేదికలో వెల్లడైంది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే ఛాన్స్‌ ఉందట. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇదేగనుక జరిగితే మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే బెంగళూరు 13 పాయింట్లతో లీగ్‌ దశను ముగిస్తుంది. చెన్నై 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వరుణుడు కరుణించి మ్యాచ్‌ జరగాలని, అందులో ఆర్సీబీ గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.  

మ్యాచ్‌ జరిగితే.. 

ఒకవేళ మ్యాచ్‌ జరిగితే చెన్నైపై ఆర్సీబీ 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో గెలవాలి లేదా చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే సీఎస్కే నెట్‌ రన్‌రేట్‌ను ఆర్సీబీ అధిగమించి ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. బెంగళూరుపై ఓడినా చెన్నైకి అవకాశాలుంటాయి. అవన్నీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని