RCB vs GT: కొనసాగుతున్న వర్షం.. గుజరాత్‌ X బెంగళూరు మ్యాచ్‌ టాస్‌ ఆలస్యం

బెంగళూరులో వర్షం పడుతుండటం ఆర్‌సీబీ (RCB) అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గుజరాత్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్దామనే ఆశలకు అడ్డుకట్టపడేలా ఉందని వాపోతున్నారు. మ్యాచ్‌ సమయానికి (రాత్రి 7. 30 గంటలకు) వర్షం ఆగాలని కోరుకుంటున్నారు. 

Updated : 21 May 2023 18:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2023(IPL 2023) సీజన్‌లో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడేందుకు గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే బెంగళూరులో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఆ తర్వాత వర్షం తగ్గినా... ప్రస్తుతం జల్లులు పడుతున్నాయి. దీంతో టాస్‌ ఆలస్యం అవుతుందని ఐపీఎల్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. 

గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకోగా, బెంగళూరుకు ఈ మ్యాచ్‌ కీలకం. ఇందులో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. అయితే బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో ప్లేఆఫ్స్‌ అవకాశాల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 

వర్షం లేకుండా.. మ్యాచ్‌ జరిగితే గుజరాత్‌పై బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

వర్షం పడి మ్యాచ్‌ ఆగిపోతే.. గుజరాత్‌ (18 పాయింట్లు), బెంగళూరు (14 పాయింట్లు) జట్లకు చెరొక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు గుజరాత్‌ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆ జట్టుదే అగ్రస్థానం. ఇక బెంగళూరు పాయింట్ల సంఖ్య 15కి చేరుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి (14 పాయింట్లు) ఓడిపోతేనే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అలా కాకుండా ముంబయి గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకుంటుంది.

దీంతో రాజస్థాన్‌ (14 పాయింట్లు) ఆశలు కూడా అడుగంటిపోతాయి. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లొచ్చని ఆశపడుతున్న రాజస్థాన్‌కు నిరాశే మిగులుతుంది. 

ఆర్‌సీబీలో నా పాత్ర రెండు విధాలు: డుప్లెసిస్‌

‘‘రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో నా పాత్ర రెండు విధాలుగా ఉంటుంది. బ్యాటర్‌గా నా అనుభవంతో జట్టుకు సహకారం అందించడం.. ఇక సారథిగా తండ్రి పాత్రను పోషించాల్సి ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ యువ క్రికెటర్లలోని టాలెంట్‌ను బయటకు తీసుకురావాలి’’ అని ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ తెలిపాడు. 

ఆ ఇద్దరు ఎదురుపడితే: హర్భజన్‌

లీగ్ స్టేజ్‌లో గౌతమ్‌ గంభీర్‌ - విరాట్ కోహ్లీల మధ్య వాగ్వాదం చేసుకున్న సంఘటన తర్వాత ఇరు జట్ల మధ్య ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన లఖ్‌నవూ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బెంగళూరు చివరి మ్యాచ్‌లో గెలిస్తే నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌ ఆడే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి లఖ్‌నవూ, బెంగళూరు తలపడతాయి. ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ... ‘‘ఈసారి విరాట్, గంభీర్‌ ఎదురైతే.. ఇరువురూ వాగ్వాదం చేసుకోరని అనిపిస్తోంది. అయితే, నాకు ఇప్పుడే అదే ఆందోళనగానూ ఉంది’’ అని చెప్పాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని