SRH: హైదరాబాద్‌ దండయాత్ర.. రికార్డులే రికార్డులు..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హైదరాబాద్‌ అదరగొడుతోంది. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది.

Updated : 16 Apr 2024 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లో హైదరాబాద్‌ దండయాత్ర కొనసాగుతోంది. బ్యాట్‌తో వీరవిహారం చేస్తూ.. తాను నమోదు చేసిన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తోంది. ట్రావిస్‌ హెడ్‌ పిడుగులు, క్లాసెన్‌ ఉరుములు, అభిషేక్‌, మార్‌క్రామ్‌ మెరుపులతో నిన్న చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌ బ్యాటర్లు దంచికొడితే.. ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారారు. అటు బెంగళూరు కూడా తక్కువేమీ కాదని నిరూపించింది. బ్యాట్‌తో దీటుగా బదిలిచ్చి 262 పరుగుల వరకూ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు సైతం నమోదయ్యాయి.

  • ఈ సీజన్‌లో తాను నెలకొల్పిన ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు రికార్డు(277)ను 20 రోజులకే హైదరాబాద్‌(287) బద్దలు కొట్టింది.
  • ఒకే సీజన్‌లో రెండు సార్లు 250+ స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్‌ అవతరించింది.
  • ఈ మ్యాచ్‌లో 50+ భాగస్వామ్యాలు ఏడు నమోదయ్యాయి. టీ20 ఫార్మాట్‌లో గతంలో ఇన్ని ఎప్పుడూ నమోదు కాలేదు.
  • రెండు జట్లు కలిపి 549 పరుగులు చేశాయి. ఇది టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యధికం.
  • హైదరాబాద్‌ 22 సిక్స్‌లు నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ జట్టు కొట్టిన అత్యధిక సిక్స్‌లు ఇవే.
  • ఈ మ్యాచ్‌లో మొత్తం 38 సిక్సర్లు నమోదయ్యాయి. ప్రపంచ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గత రికార్డు 37.
  • రెండు జట్లూ కలిపి మొత్తం 81 ఫోర్లు కొట్టాయి. టీ20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇన్నే ఫోర్లు నమోదయ్యాయి.
  • ఈ మ్యాచ్‌లో బెంగళూరు పోరాడి ఓడింది. టీ20 క్రికెట్‌లో ఓడిపోయిన జట్టు చేసిన అత్యధిక స్కోరు(262/7) ఇదే.
  • హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు నలుగురు. ఐపీఎల్‌లోనే కాదు పురుషుల టీ20లోనే ఇలా జరగడం తొలిసారి. టాప్లీ 68, యశ్‌ దయాల్‌ 51, ఫెర్గూసన్‌ 52, వైశాఖ్‌ 64 పరుగుల చొప్పున ఇచ్చారు.
  • టీ20 ఫార్మాట్‌లో రెండో అత్యధిక స్కోరు ఇదే. 2023లో నేపాల్‌ మంగోలియాపై 314/3 పరుగులు చేసింది.
  • ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తరఫున ట్రావిస్‌ హెడ్‌దే వేగవంతమైన సెంచరీ. 39 బంతుల్లోనే దీనిని చేరుకున్నాడు.  ఐపీఎల్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం.
  • ఐపీఎల్‌ చరిత్రలోనే 250+ స్కోర్లు ఇప్పటి వరకూ ఐదు సార్లు మాత్రమే నమోదు కాగా.. ఈ సీజన్‌లోనే మూడు ఉన్నాయి. ఒకే మ్యాచ్‌లో రెండు జట్లు ఈ మార్కును దాటడం విశేషం.
  • ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సార్లు 250+ స్కోర్లు చేసిన జట్లుగా హైదరాబాద్‌, బెంగళూరు నిలిచాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని