RCBW vs UPW: పెర్రీ అర్ధశతకం.. యూపీ వారియర్స్‌ లక్ష్యం 139

యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ  19.3 ఓవరల్లో 138 పరుగులకు ఆలౌటయ్యింది.

Updated : 10 Mar 2023 21:13 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఎల్సే పెర్రీ (52; 6×4, 1×6) అర్ధశతకంతో రాణించగా.. సోఫీ డివైన్‌ (36), శ్రేయాంక పాటిల్‌ (15), ఎరిన్‌ బర్న్స్‌ (12 నాటౌట్‌) పరుగులు చేశారు. యూపీ జట్టులో సోఫీ ఎక్లెస్టోన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ 3, రాజేశ్వరి గైక్వాడ్‌ ఒక వికెట్‌ తీశారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (4) తక్కువ స్కోరుకే ఔటయ్యింది. రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన 3.1వ బంతికి షాట్‌ ఆడబోయి అంజలి శ్రావణికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సోఫీ డివైన్‌తో కలిసి మరో ఓపెనర్‌ పెర్రీ ఇన్నింగ్స్‌ నిర్మించింది. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే, ఈ జోడీని ఎక్లెస్టోన్‌ విడగొట్టింది. జట్టు స్కోరు 73 పరుగుల వద్ద డివైన్‌ బౌల్డయ్యింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కనిక ఆహుజ (8), హీదర్‌ నైట్‌ (2) శ్రేయంక పాటిల్‌ (15) తక్కువ స్కోరుకే వరుసగా వెనుదిరుగుతున్నా పెర్రీ మాత్రం పట్టు విడవలేదు. పరుగు పరుగు జోడిస్తూ అర్ధశతకం పూర్తి చేసింది. అయితే, జట్టు స్కోరు 125 వద్ద దీప్తి శర్మ బౌలింగ్‌లో మెక్‌గ్రాత్‌కు క్యాచ్‌ ఇచ్చి.. పెర్రీ వెనుదిరిగింది. దీంతో ఒక్కసారిగా జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ పెద్దగా రాణించకపోవడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ 138 పరుగుల తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని