MS Dhoni: ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్‌కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్‌

ప్రస్తుత సీజన్‌లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు.

Published : 20 Apr 2024 13:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై ఏడు మ్యాచ్‌లు ఆడింది. నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (8 పాయింట్లు) కొనసాగుతోంది. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. భారీ షాట్లు ఆడుతూ కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు రావడం.. ధనాధన్ షాట్లతో విరుచుకుపడటంతో అభిమానులను అలరించాడు. ఇలా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 87 పరుగులు చేశాడు. అన్నింట్లోనూ నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ధోనీకి ప్రమోషన్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారంటే అతడి ఆటతీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ధోనీ ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌ రాకపోవడానికి కారణం ఏంటా? అనే సందేహం తలెత్తింది. దీనికి చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానం ఇచ్చాడు. 

‘‘ధోనీ ఆటతీరు యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్‌ అద్భుతం. నెట్స్‌లోనూ ఇలా దూకుడుగా షాట్లు కొట్టేవాడు. జట్టు సభ్యులెవరూ ధోనీ ప్రదర్శన చూశాక ఆశ్చర్యానికి గురి కాలేదు. అతడి నైపుణ్యాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. గతేడాది ఐపీఎల్ సీజన్‌ ముగిశాక మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అతడు ఆ నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అందుకే, కొన్ని బంతులను మాత్రమే ఎదుర్కొనేందుకు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరూ అతడి ఆటను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారిని నిరుత్సాహానికి గురి చేయకూడదని ఇలా బ్యాటింగ్‌ వస్తున్నాడు. ఈ టోర్నీలో అతడు జట్టుతోపాటు ఉండటం మాకెంతో అవసరం’’

‘‘చివరి రెండు లేదా మూడు ఓవర్లు ఉన్నప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. మా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలంగా ఉండటంతో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనుక వస్తున్నాడు. అతడు బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో స్టేడియమంతా మార్మోగుతోంది. అలాంటి వాతావరణం చూస్తుంటే మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలుగుతుంది. ప్రేక్షకుల నుంచి అలాంటి ప్రేమను ధోనీ పొందడం అద్భుతం. అతడు ఉన్న జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగానూ ఫీలవుతా. బ్యాటింగ్‌కు వస్తుంటే అభిమానుల్లోనే కాకుండా మా హార్ట్‌బీట్‌ కూడా పెరుగుతుంది’’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు