world cup 2023: మైదానంలో నిశ్శబ్దానికి కారణాలెన్నో..!

కోహ్లీ, రోహిత్‌ సర్వశక్తులు ఒడ్డినా.. బుమ్రా, షమీలు శ్రమను ధారపోసినా.. భారత్‌కు మూడోసారి ప్రపంచకప్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 11 మంది సమష్టిగా ఆడే ఆటలో ఏ ఒక్కరి ప్రతిభతోనే టోర్నీలు సాధించడం అసాధ్యమని భారత్‌కు మరోసారి ఈ ఓటమి తెలియజేసింది.

Updated : 20 Nov 2023 10:31 IST

బ్యాటింగ్‌ వైఫల్యాలకు దారుణమైన ఫీల్డింగ్‌ తోడు కావడంతో భారత్‌ ప్రపంచకప్‌ను చేజార్చుకుందనే చెప్పాలి. టాస్‌, పిచ్‌, వాతావరణం వంటి వాటిని కారణాలుగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఏమ్యాచ్‌లోనూ వాటిలో మార్పు చేసుకోవడం జట్టు చేతిలో ఉండదు. కానీ, వాటిని అర్థం చేసుకుంటూ.. దానికి తగినట్లు సిద్ధం కావడం మాత్రం ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. అన్నింటికి మించి ఎదురుదెబ్బలను తట్టుకొని తుదివరకు పోరాడే తత్వం లోపించిందనిపించింది.

డైవ్‌ చేయడం మర్చిపోయినట్లున్నారు..

ఫీల్డింగ్‌లో డైవింగ్‌ అనేది ఒకటి ఉంటుందని భారత ఆటగాళ్లు మర్చిపోయినట్లున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బౌండరీ లైన్‌కు కొన్ని అంగుళాల దూరంలో డైవ్‌ చేసి మరీ బంతిని ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 37 ఏళ్ల వార్నర్‌ బౌండరీ లైన్‌ వద్ద అడ్డంగా గోడ కట్టారా అన్నట్లు ఫీల్డింగ్‌ చేశాడు. ఆసీస్‌ ఈ రకంగా కనీసం 40 పరుగులను భారత్‌ నుంచి లాక్కొని ఉంటుంది. ఇది మన ఇన్నింగ్స్‌పై పెను ప్రభావం చూపింది. ఇక 11 నుంచి 50 ఓవర్‌ మధ్యలో కేవలం నాలుగు బౌండరీలనే ఇచ్చారంటే.. ఆసీస్‌ ఫీల్డర్ల నుంచి బౌలర్లకు లభించిన సహకారాన్ని అర్థం చేసుకోవచ్చు. 1999 నుంచి ఒక వన్డే మ్యాచ్‌లో 10వ ఓవర్‌ తర్వాత భారత్‌ కొట్టిన అత్యల్ప బౌండరీలు ఇవే. వీటిల్లో ప్రధాన బ్యాటర్లు కాకుండా టెయిలెండర్లైన షమి, సిరాజ్‌ కొట్టినవి రెండు ఉన్నాయి.

ఇక భారత్‌ ఫీల్డింగ్‌లో డైవ్‌ చేసిన సందర్భాలు కేవలం ఒకట్రెండు ఉంటాయి. చాలా సార్లు మన ఫీల్డర్లు డైవ్‌ చేయాల్సిన చోట కూడా బంతితోపాటు బౌండరీని దాటేస్తున్నారు. ఇలాంటి ఫీల్డింగ్‌కుతోడు 18 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకొన్నారు.

బ్యాటర్లపై పనిచేసిన ఒత్తిడి..

భారత బ్యాటర్లు ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జట్టును వీలైనంత సౌకర్యవంతమైన స్థానంలో ఉంచేందుకు రోహత్‌ సహజశైలిలో ఎదురుదాడికి దిగాడు. మరోవైపు నిలకడగా ఆడాల్సిన గిల్‌ చెత్తషాట్‌కు యత్నించి వికెట్‌ సమర్పించుకొన్నాడు. వాస్తవానికి గిల్‌కు ఈ మైదానం కొత్తేమీకాదు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపు ఆడే అతడికి ఇది హోం గ్రౌండ్‌ వంటిది.

కలల పరుగుకు కన్నీటి ముగింపు

మరోవైపు రోహిత్‌ దాడి ఫలితం చూపించడంతో..పది ఓవర్లుకు ఎనిమిది రన్‌రేట్‌తో 80 పరుగులు చేయగలిగింది. ఇక రోహిత్‌ ఔట్‌ తర్వాత బరిలోకి దిగిన శ్రేయస్‌ రిస్క్‌తో కూడిన బంతిని కదిలించి వికెట్‌ సమర్పించుకొన్నాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించినట్లు కనిపించలేదు. దీంతో ఇన్నింగ్స్‌కు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కోహ్లీ, రాహుల్‌పై పడింది. మరో వికెట్‌ పడకుండా స్కోరును 148 వద్దకు చేర్చారు. కానీ, బౌండరీలు రావడం గగనమై.. స్కోర్‌ వేగం మందగించింది.

ముఖ్యంగా ఆసీస్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత్‌ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్‌లో స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ వంటి సీమర్లు 20 ఓవర్లలో 115 పరుగులు ఇస్తే.. మ్యాక్స్‌వెల్‌, జంపా, హెడ్‌ కలిపి 18 ఓవర్లు వేసి కేవలం 85 పరుగులు ఇవ్వడం గమనార్హం.

సూర్యా ఇదేంటయ్యా..!

28 బంతులకు 18 పరుగులు. ఇతడా ప్రపంచంలోనే నంబర్‌ 1 టీ20 బ్యాటర్‌..! ప్రపంచకప్‌ టోర్నీ మొత్తంలో మిస్టర్‌ 360కి బ్యాటింగ్‌ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ, తనను తాను నిరూపించుకోవడానికి ప్రపంచకప్‌ ఫైనల్‌ రూపంలో అద్భుతమైన ఛాన్స్‌ వచ్చింది. ఫినిషర్‌గా ఇన్నింగ్స్‌ను ముగిస్తాడని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. అతడు బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి దాదాపు 10 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

అతడి తర్వాత మొత్తం టెయిలెండర్లే. వారు ఆసీస్‌ బౌలర్లకు ఎరకాకుండా తాను స్ట్రైకింగ్‌లో ముందుండి ఎదురు దాడి చేయాల్సిన సమయంలో కేవలం సింగిల్స్‌ తీసి టెయిలెండర్లకు స్ట్రైకింగ్‌ ఇస్తూ కాలయాపన చేశాడు. అసలు అతడు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఆడుతున్నట్లే అనిపించలేదు. అతడి వైఫల్యంలో పిచ్‌ను నిందించడానికి ఏమీలేదు.. అదే పిచ్‌పై అంతకు ముందు రోహిత్‌ శరవేగంగా 47 బాదాడన్న విషయం మర్చిపోయినట్లు కనిపించింది. ఆ తర్వాత లబుషేన్‌, హెడ్‌లు భారీ స్కోర్లు చేశారు.

ఓ పక్క హేజల్‌వుడ్‌ సూర్యాకు స్లో షార్ట్‌పిచ్‌ బాల్‌ రూపంలో ఉచ్చు పన్నిన విషయం కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అంతకు ముందే అలాంటి బంతికే ఔటైనంత పనైంది. కొంచెం మార్పులతో హేజిల్‌వుడ్‌ సంధించిన తర్వాతి బంతికి అలాంటి షాటే ప్రయత్నించి వికెట్‌ సమర్పించుకొని పెవిలియన్‌కు చేరుకొన్నాడు.

పోరాడే తత్వం ఏదీ..

వాస్తవానికి టీమ్‌ ఇండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా ఆరంభమే అత్యంత దారుణంగా ఉంది. మనం 10.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేస్తే.. ఆసీస్‌ 6.6 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. కానీ, లక్ష్యం, మారుతున్న పిచ్‌ను సరిగ్గా అంచనా వేసి ట్రావిస్‌ హెడ్‌, లబూషేన్‌.. ఏమాత్రం తొందరపడకుండా నిలకడగా స్కోర్‌బోర్డును ముందుకు నడిపించారు. గతంలో అఫ్గానిస్థాన్‌పై, దక్షిణాఫ్రికాపై ఆసీస్‌ క్రీడాకారులు ఇలాంటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు.

భారత్‌ 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌, 2015 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌, 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌, 2022 టీ20 సెమీస్‌, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌.. తాజాగా 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఓటమికి ఆటగాళ్ల ప్రతిభా లోపం కారణం కాదు. కేవలం నాకౌట్స్‌లో ఉండే ఒత్తిడే కారణంగా నిలుస్తోంది. భారత్‌ ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకొంటే భవిష్యత్తులో మైదానంలో అభిమానుల కేరింతలు చూడొచ్చు.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని