Cricket News: రసెల్‌ మళ్లీ ఆల్‌రౌండ్‌ షో.. ఖవాజా బూట్లపై నినాదాలు.. దక్షిణాఫ్రికాతో టీ20లో వారెందుకు లేరు?

Published : 13 Dec 2023 13:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కీలక ఇన్నింగ్స్‌తో గెలిపించాడీ ప్లేయర్. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీడాపరికరాలపై ఎలాంటి స్లోగన్స్‌ ఉండకూడదు. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో సీనియర్లను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ ప్రశ్నల వర్షం.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

రెండేళ్ల తర్వాత ఆండ్రూ రసెల్‌ విశ్వరూపం

క్రికెట్‌ బోర్డుతో విభేదాల కారణంగా విండీస్‌ ఆటగాడు ఆండ్రూ రసెల్‌ (Andre Russell) దాదాపు రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన రసెల్‌ (3/19) .. బ్యాటింగ్‌లోనూ 14 బంతుల్లోనే 29 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అతడిపాటు కెప్టెన్ రోవ్‌మన్‌ పావెల్ (31*: 15 బంతుల్లో) విజృంభించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 171 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 18.1 ఓవర్లోనే ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి విజయం సాధించింది.


‘పాలస్తీనా’ వివాదం.. ఖవాజా బూట్లపై నినాదాలు

ఆస్ట్రేలియా టెస్టు బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) చిక్కుల్లో పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఆసీస్ ప్రాక్టీస్‌ సెషన్స్‌ నిర్వహించింది. అయితే, ఖవాజా తాను ధరించిన బూట్లపై ‘‘స్వేచ్ఛ అనేది మానవహక్కు.. అందరూ సమానమే’’ అనే నినాదాలు రాసి ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారాయి. తొలి టెస్టులోనూ ఈ బూట్లను ధరించాలని ఖవాజా భావించాడని.. అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులు మాత్రం ఐసీసీ నిబంధనలను గుర్తు చేయడంతో వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ‘‘మేం ఆటగాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తాం. కానీ, ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆటగాళ్లు కూడా సమర్థిస్తారని ఆశిస్తున్నాం’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆసీస్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కూడా ఉస్మాన్‌ ఖవాజాకు మద్దతుగా ఉంటూనే ఐసీసీ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.


బిష్ణోయ్, శ్రేయస్‌ ఎందుకు లేరు?: ఆకాశ్ చోప్రా

ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో సెంచరీతో అలరించిన రుతురాజ్‌ గైక్వాడ్, ‘ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌’ రవి బిష్ణోయ్‌తోపాటు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్‌ అయ్యర్‌ను (Shreyas Iyer) దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో ఆడించలేదు. దీంతో మాజీ క్రికెటర్‌, క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించాడు. ‘‘అయ్యర్, బిష్ణోయ్ ఎందుకు ఆడటం లేదో ఎవరికైనా తెలుసా? శ్రేయస్‌ గత సిరీస్‌లో వైస్‌ కెప్టెన్. అలాగే బిష్ణోయ్ (Ravi Bishnoi) ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. నేను ఏదో మిస్‌ అయినట్లు అనిపించింది’’ అని ఆకాశ్‌ ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చేందుకే ఇలాంటి మార్పులు చేయాల్సి వస్తుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని