ODI WORLD CUP 2023: వన్డే ప్రపంచకప్‌.. రికార్డుల కప్‌..

భారత్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) రికార్డుల మోత మోగుతోంది. అవును.. ఈ మెగా టోర్నీ ఇప్పుడు కొత్త రికార్డులకు వేదికగా నిలుస్తోంది.

Published : 15 Oct 2023 15:12 IST

పరుగుల వరద పారుతోంది.. సెంచరీల జోరు కొనసాగుతోంది.. వికెట్ల వేట హోరెత్తిస్తోంది.. మొత్తంగా భారత్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో రికార్డుల మోత మోగుతోంది. అవును.. ఈ మెగా టోర్నీ ఇప్పుడు కొత్త రికార్డులకు వేదికగా నిలుస్తోంది. ప్రపంచకప్‌ ఆరంభమై పది రోజులు గడిచింది. 12 మ్యాచ్‌లు మాత్రమే పూర్తయ్యాయి. కానీ రికార్డులు మాత్రం ఊహించని స్థాయిలో బద్దలవుతున్నాయి. ఆరంభ మ్యాచ్‌ మొదలు.. భారత్‌- పాక్‌ పోరు వరకూ దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదైందనే చెప్పాలి. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు, అత్యధిక ఛేదన రికార్డులు ఇప్పటికే ఆవిష్క్రతమయ్యాయి. ప్రపంచకప్‌లో సత్తాచాటాలనే ఉద్దేశంతో అన్ని జట్లు బరిలో దిగడం.. అత్యుత్తమ ఆటతీరుతో రాణించేందుకు ఆటగాళ్లు కసితో ఉండటంతో రికార్డుల మోత మోగుతోంది. 

ఆరంభమే అదుర్స్‌..

ప్రపంచకప్‌ ఆరంభమే అదుర్స్‌ అని చెప్పాలి. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో 2019 ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో అప్పటి రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడింది. మొదట ఇంగ్లాండ్‌ 282/9 స్కోరుకే పరిమితమైంది. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లందరూ రెండంకెల స్కోరు సాధించారు. వన్డే చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్‌లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు చేయడం ఇదే తొలిసారి. ఛేదనలో కాన్వే, రచిన్‌ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ అలవోకగా విజయాన్ని అందుకుంది. అయితే ఈ క్రమంలో అభేద్యమైన రెండో వికెట్‌కు 273 పరుగులు జోడించిన కాన్వే- రచిన్‌.. ప్రపంచకప్‌ చరిత్రలో న్యూజిలాండ్‌ తరపున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేశారు. అలాగే రచిన్‌ ప్రపంచకప్‌ అరంగేట్రంలో శతకం సాధించిన అతి పిన్న వయస్సు (23 ఏళ్ల 321 రోజులు) కివీస్‌ ఆటగాడిగా నిలిచాడు. అంతే కాకుండా 82 బంతుల్లోనే సెంచరీ చేసిన అతను.. న్యూజిలాండ్‌ తరపున ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అనంతరం శ్రీలంకపై చెలరేగిన దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర సృష్టించింది. ఆ జట్టులో డికాక్, వాండర్‌డసెన్, మార్‌క్రమ్‌ సెంచరీలు బాదడంతో ఆ జట్టు ఏకంగా 428/5 స్కోరు చేసింది. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఆస్ట్రేలియా (2015లో అఫ్గానిస్థాన్‌పై 417/7) రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. అలాగే ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు నమోదవడం కూడా ఇదే మొదటిసారి. 49 బంతుల్లోనే సెంచరీ అందుకున్న మార్‌క్రమ్‌.. ప్రపంచకప్‌ల్లో అత్యంత వేగవంతమైన శతకం రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 

మన జట్టు..

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు కూడా కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో వద్దనుకునే ఓ రికార్డును భారత్‌ సాధించింది. ఓ వన్డే మ్యాచ్‌లో భారత టాప్‌-4 ఆటగాళ్లలో ముగ్గురు డకౌటవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఇషాన్, రోహిత్, శ్రేయస్‌ సున్నాకే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లోనే ఆసీస్‌ ఓపెనర్‌ వార్నర్‌.. ప్రపంచకప్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ (19)ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్, డివిలియర్స్‌ (20)ను వెనక్కినెట్టాడు. మరో వైపు పేసర్‌ స్టార్క్‌ ప్రపంచకప్‌ల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (19)ల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక అఫ్గాన్‌పై భారీ విజయంతో పాటు కొన్ని రికార్డులను భారత్‌ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ.. ప్రపంచకప్‌ల్లో అత్యధిక శతకాలు (7) చేసిన ఆటగాడిగా సచిన్‌ (6)ను వెనక్కినెట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (553)నూ రోహిత్‌ అధిగమించాడు. ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ (63 బంతుల్లో) రికార్డునూ సొంతం చేసుకున్నాడు. అలాగే ప్రపంచకప్‌ల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (19)లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వార్నర్‌ సరసన రోహిత్‌ నిలిచాడు. ఇక పాక్‌తో మ్యాచ్‌తో వన్డేల్లో 300కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. 157 వికెట్లతో ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ ఘనత సాధించాడు. 

మన ఉప్పల్‌లో.. 

ఈ ప్రపంచకప్‌లో ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ల్లోనూ రికార్డుల వెల్లువ కొనసాగింది. నెదర్లాండ్స్‌తో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఓ రికార్డు అందుకున్నాడు. ఉప్పల్‌ స్టేడియంలో వన్డేలో అయిదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇదే వేదికలో జరిగిన శ్రీలంక- పాక్‌ పోరులోనూ ఓ ప్రతిష్ఠాత్మక రికార్డు బద్దలైంది. లంకపై పాక్‌ 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక ఛేదన. 2011లో ఇంగ్లాండ్‌పై 328 పరుగుల ఛేదనతో ఐర్లాండ్‌ నెలకొల్పిన రికార్డును పాక్‌ తిరగరాసింది. ఈ మ్యాచ్‌లో శతకం చేసిన అబ్దుల్లా షఫీˆక్‌.. ప్రపంచకప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి పాక్‌ ఆటగాడిగా నిలిచాడు. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ ప్రపంచకప్‌లో ఇంకా అనేక మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో మరెన్నో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమేనని చెప్పాలి. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని