IPL 2023 : ఇది ఆట కాదు అంతకుమించి.. ప్రతీకారం తీర్చుకున్నారిలా..

ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌ సగానికిపైగా పూర్తయ్యింది. అయితే పలు జట్ల మధ్య స్వీట్‌ రివేంజ్‌ కొనసాగింది. వారి సొంత మైదానంలోనే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఆసక్తికరమైన మ్యాచ్‌లను పరిశీలిస్తే..

Updated : 08 May 2023 13:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రత్యర్థిని వారి సొంత మైదానంలోనే ఓడిస్తే.. ఆ జట్టుకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదీ గతంలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటే.. ఇక ఆ మజానే వేరు. ఈ ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌లో అలాంటి మ్యాచ్‌లు చాలానే చూశాం. ఈ క్రమంలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో.. తీవ్ర వివాదాలకు దారితీసిన ఓ మ్యాచ్‌ (LSG vs RCB)నూ చూశాం. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. తన తొలి మ్యాచ్‌లో భారీ ఓటమికి రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ తమ ప్రత్యర్థులను వారి సొంత మైదానాల్లో ఓడించి.. అంతకుముందు ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న మ్యాచ్‌ల్లో ఆసక్తికరమైన వాటిని పరిశీలిస్తే.. 

రాజస్థాన్‌ vs సన్‌రైజర్స్‌.. ‘నో బాల్‌’ అందించిన విజయం

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ సొంతమైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌ చేతిలో భారీ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్లు విజృంభించడంతో ఆ జట్టు 203 పరుగులు చేసింది. అయితే.. ఆ తర్వాత ఛేదనకు దిగిన హైదరాబాద్‌ 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హైదరాబాద్‌ను సొంత గడ్డపై ఓడించి భారీ విజయాన్ని రాజస్థాన్‌ నమోదు చేసింది. అయితే నిన్న వీరి మధ్య జైపుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేసింది. చివరి బంతికి నోబాల్‌ కలిసిరావడంతో 4 వికెట్ల తేడాతో గెలిచి ఆ జట్టుకు హైదరాబాద్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లో 200కుపైగా పరుగులు నమోదు కావడం విశేషం.

లఖ్‌నవూ vs బెంగళూరు.. వార్‌ ఆఫ్‌ వర్డ్స్‌

ఇప్పటి వరకూ ఐపీఎల్‌ మ్యాచ్‌ల గురించి జరిగిన చర్చ ఒక ఎత్తు అయితే.. ఈ మ్యాచ్‌(LSG vs RCB) గురించి జరిగిన చర్చ మరో ఎత్తు. అంతలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఈ మ్యాచ్‌. విరాట్‌ కోహ్లీ (virat kohli)- గంభీర్‌ (Gautam Gambhir), నవీనుల్‌హాక్‌ (naveen ul haq) మధ్య మాటల తూటాలు పేలాయి. చివరికి ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. అయితే ఈ వివాదానికి బీజం పడింది అంతకుముందు వీరిద్దరి మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లోనే. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు వికెట్‌ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో అనూహ్య విజయాన్ని సాధించడంతో లఖ్‌నవూ మెంటార్‌ గంభీర్‌.. స్టేడియంలో ఆర్సీబీ అభిమానులను మౌనంగా ఉండాలంటూ సంజ్ఞ చేశాడు. ఆ తర్వాత లఖ్‌నవూ వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో  బెంగళూరు గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇదే సమయంలో మ్యాచ్‌ మధ్యలో కోహ్లీ తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించాడు. లఖ్‌నవూ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 16-17వ ఓవర్‌ మధ్యలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం  చోటుచేసుకుంది. ఇదే అంశం మ్యాచ్‌ అనంతరం కోహ్లీ-గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వీరిద్దరికీ బీసీసీఐ భారీ జరిమానా కూడా విధించింది. ఇలాంటి ప్రవర్తన ఆటకు మంచిది కాదంటూ పలువురు సీనియర్లు ఈ ఘటనపై మండిపడ్డారు.

సన్‌రైజర్స్‌ vs దిల్లీ.. స్వీట్‌ రివేంజ్‌..

ఈ స్వీట్‌ రివేంజ్‌ సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) vs దిల్లీ (Delhi Capitals) మధ్యలో చోటుచేసుకుంది. డేవిడ్‌ వార్నర్‌ (David Warner) ఎంతో కాలం ఎస్‌ఆర్‌ఎచ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో హైదరాబాద్‌  జట్టును అతడు అవమానకర పరిస్థితుల్లో వీడాల్సి వచ్చింది. ఇక ఈ సీజన్‌లో దిల్లీకి కెప్టెన్‌గా మారిన వార్నర్‌.. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను సొంత మైదానంలో 7 పరుగుల తేడాతో ఓడించి తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు. విజయం అనంతరం తనదైన శైలిలో మైదానంలో సంబరాలు కూడా చేసుకున్నాడు. అయితే.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో దిల్లీని వారి సొంత మైదానంలో ఓడించి హైదరాబాద్‌ అంతకుముందు ఓటమికి దీటుగా సమాధానమిచ్చింది.

ముంబయి vs పంజాబ్‌.. సోషల్‌ మీడియాలో ఫన్నీ వార్‌..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో జరిగిన 31వ మ్యాచ్‌లో.. ముంబయి (Mumbai Indians)ని వారి సొంత మైదానంలో పంజాబ్‌ (Punjab Kings) 13 పరుగులతో ఓడించింది. పంజాబ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 214 పరుగులు చేస్తే.. ముంబయి దానికి బదులుగా 201 పరుగులు మాత్రమే చేసింది. అయితే చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన పంజాబ్‌ యువ పేసర్‌ హర్ష్‌దీప్‌ సింగ్‌ ముంబయిని కట్టడి చేయడమే కాకుండా.. తన పదునైన బంతులతో రెండు సార్లు స్టంప్స్‌ విరగొట్టాడు. ఇదే విషయమై మ్యాచ్‌ అనంతరం ఇరు జట్లు సోషల్‌మీడియా వేదికగా ఫన్నీగా ట్వీట్లు చేస్తుకున్నాయి. వికెట్లు విరగొట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ పంజాబ్‌.. ఇది క్రైమ్‌ అంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతీగా ముంబయి.. పంజాబ్‌ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కప్‌ గెలవలేదంటూ.. వారికి కప్‌ మిస్సైందంటూ మిస్సింగ్‌ కేసు నమోదు చేయాలని సరదాగా ట్వీట్‌ చేసి పంజాబ్‌కు తనదైన శైలిలో చురకలు అంటించింది. ఇక ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను వారి సొంత మైదానంలోనే భారీ లక్ష్యం ఛేదించి మరీ ఓడించి ముంబయి ప్రతీకారం తీర్చుకుంది.

గుజరాత్‌ vs రింకు

చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కోల్‌కతా(Kolkata Knight Riders)కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన రింకు సింగ్‌(Rinku Singh) ఇన్నింగ్స్‌ను ఐపీఎల్‌ చరిత్రలో ఎవరూ మరిచిపోలేరేమో. ఈ ఇన్నింగ్స్‌తోనే రింకు.. ఛాంపియన్‌ జట్టు అయిన గుజరాత్‌(Gujarat Titans)కు వారి సొంత మైదానంలో ఈ సీజన్‌లో తొలి ఓటమి రుచి చూపించాడు. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను వారి సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో 7 వికెట్ల తేడాతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది గుజరాత్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని