Delhi Vs Kolkata: మా ఆటతీరును చూస్తే సిగ్గేసింది.. కోల్‌కతా చేతిలో దిల్లీ ఓటమిపై రికీ పాంటింగ్‌

దిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ తమ ఓటమిపై ఓపెన్‌గా మాట్లాడేశాడు. బౌలింగ్‌ విషయంలో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉందని వ్యాఖ్యానించాడు.

Updated : 04 Apr 2024 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో చెన్నైపై విజయం సాధించిన దిల్లీ జట్టుకు కోల్‌కతా రూపంలో ఓటమి ఎదురైంది. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో దిల్లీ 106 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ క్రమంలో జట్టు ఓటమిపై దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి ఆటతీరు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించాడు. కోల్‌కతా బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడంలో దిల్లీ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా దిల్లీ జట్టుకు భారీ మొత్తం జరిమానా పడింది. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రికీ పాంటింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తొలి అర్ధభాగం మా ఆటను చూస్తే సిగ్గేసింది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. దీంతో 20 ఓవర్లు వేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. రెండు ఓవర్లు వెనుకబడిపోయాం. దీంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్‌ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. కట్టుదిట్టంగా చేసినప్పటికీ ఆరంభంలో ధారాళంగా పరుగులు ఇవ్వడంతో నష్టపోయాం. ఈ మ్యాచ్‌లో మేం చాలా పొరపాట్లను చేశాం. అవేవీ ఆమోదయోగ్యం కానివి. తర్వాత మ్యాచ్‌ నాటికి సమస్యలను పరిష్కరించుకుని బరిలోకి దిగాల్సి ఉంది. లేకపోతే టోర్నీలో మరింత వెనుకబడిపోవాల్సి ఉంటుంది. 

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో కోల్‌కతా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏమాత్రం కనికరం లేకుండా మ్యాచ్‌లో దూకుడుగా ఆడారు. పవర్‌ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. అలాంటి పరిస్థితి మాకు కఠినంగా మార్చేసింది. దీంతో వారిని కట్టడి చేసేందుకు మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు నిర్దయగా ఆడేశారు. దీంతో మేం మ్యాచ్‌లో పోరాడే అవకాశం కూడా లేకుండాపోయింది. ఈ ఓటమి మమ్మల్ని నిరాశ పరిచినా.. రిషభ్ పంత్‌ జోరు కొనసాగడం బాగుంది. ప్రమాదానికి గురై కోలుకున్నాక ఆడుతున్న తొలి సీజన్‌ కావడంతో అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. వాటన్నింటినీ పంత్ అందుకొన్నాడు. ఏకాగ్రతగా ఆడిన తీరు అభినందనీయం. ఇప్పటి వరకు పంత్‌ ఫిజియోను పిలిచిన దాఖలాలు లేవు. క్రీజ్‌లోనూ, స్టంప్స్‌ వెనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్‌గా ఉన్నాడు. కొన్నిసార్లు కాస్త తిమ్మిరి పట్టినట్లు అనిపించినా.. అదేమీ పెద్ద సమస్య కాబోదు’’ అని పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని