Rinku Singh: స్టార్క్‌కు రూ.25 కోట్లు.. నీకు రూ.55 లక్షలేనా?ఈ ప్రశ్నకు రింకు సూపర్ ఆన్సర్

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అనతికాలంలోనే రింకు సింగ్‌ జాతీయజట్టులోకి వచ్చాడు. టీ20 ప్రపంచ కప్‌ రిజర్వ్‌ ట్రావెల్‌లో అవకాశం దక్కించుకున్నాడు.

Updated : 28 May 2024 19:17 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల పేర్లను చెప్పమంటే.. ఠక్కున రింకుసింగ్‌ గుర్తుకొచ్చేస్తాడు. గత సీజన్‌లో గుజరాత్ బౌలర్ యశ్ దయాళ్‌ బౌలింగ్‌లో ఐదు సిక్స్‌లు బాది అందరి దృష్టిలో పడ్డాడు. జాతీయజట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన రిజర్వ్‌ ట్రావెల్‌లో రింకు ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్‌ టైటిల్ విజేతగా కోల్‌కతా నిలిచింది. ఈసారి రింకుకు బ్యాటింగ్‌ చేసే అవకాశం పెద్దగా రాలేదు. వచ్చినప్పుడు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్‌ (రూ. 24.75 కోట్లు) ఈ జట్టులోని సభ్యుడే. రింకుకు మాత్రం రూ. 55 లక్షలే అందుతున్నాయి. వేలంలోకి వస్తే కనీసం రూ.10 కోట్లు దక్కే అవకాశం లేకపోలేదు. ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో అతడికి ఎదురైంది. దానికి రింకు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. 

‘‘నా దృష్టిలో రూ.55 లక్షలు చాలా ఎక్కువ. నేను క్రికెట్‌ ఆడటం ప్రారంభించినప్పుడు ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. చిన్న వయసులో రూ.5 సంపాదించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను రూ.55 లక్షలు ఆర్జిస్తున్నా. దేవుడు ఇచ్చిన దానికి తప్పకుండా సంతోషిస్తా. నా ఆలోచన ఎప్పుడూ ఇలానే ఉంటుంది. నేనెప్పుడూ లెక్కలు వేసుకోలేదు. ఇప్పుడీ సంపాదనతో ఆనందంగా ఉన్నా. అవి లేని రోజులను చవిచూశా. కాబట్టి, డబ్బు విలువ నాకు తెలుసు.

పెద్దలు చెప్పినట్లు మనం వస్తూ ఏమీ తీసుకురాం. వెళ్తూ ఏం పట్టుకుపోం. కాలం ఎలా మారుతుందో చెప్పలేం. ఎలా వచ్చామో.. అలానే ఉండాలనేది నేను చెప్పేమాట. ఎప్పుడూ నేల విడిచి సాము చేయకూడదు. అలా చేస్తే పరిస్థితులు ఎలా అయినా మారిపోతాయి. జేబులో డబ్బు లేని రోజులను అనుభవించా. ఇప్పుడు కావాల్సినంత ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం’’ అని రింకు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు