Rishabh Pant: ఈసారి రిషభ్‌ పంత్‌పై మ్యాచ్‌ వేటు తప్పదా?

ఐపీఎల్ 17వ సీజన్‌లో రిషభ్ పంత్ చిక్కుల్లో పడేలా ఉన్నాడు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మూడోసారి తప్పిదానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Published : 14 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కెప్టెన్‌గా రిషభ్‌ పంత్ మాత్రమే రెండుసార్లు జరిమానాలు ఎదుర్కొన్నాడు. తొలిసారి రూ.12 లక్షలు, రెండోసారి ఏకంగా రూ.24 లక్షల ఫైన్‌ను ఈ దిల్లీ సారథి కట్టాడు. అదంతా స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ విధించింది. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌ సమయంలోనూ మరోసారి స్లో ఓవర్‌రేట్‌తోపాటు అంపైర్‌తో వాగ్వాదం చేయడం పంత్‌కు తిప్పలు తెచ్చేలా ఉన్నాయి. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ నాటికి దిల్లీ నిర్దేశించిన సమయానికి ఓ ఓవర్‌ వెనకబడి ఉంది. దీంతో నిబంధనల ప్రకారం ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో సర్కిల్ అవతల అయిదుగురికి బదులు కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచాలి. లఖ్‌నవూ మ్యాచ్‌లోనూ దిల్లీకి ఇలానే జరిగింది. దీంతో ఐపీఎల్‌ నుంచి మరోసారి పంత్‌కు భారీ జరిమానాతోపాటు ఒక మ్యాచ్‌ నిషేధం రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిబంధనలు ఇలా.. 

ఐపీఎల్‌ రూల్స్ ప్రకారం.. తొలిసారి స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదానికి కెప్టెన్‌ రూ.12 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే పొరపాటును మళ్లీ చేస్తే రెట్టింపు జరిమానా అంటే రూ.24 లక్షలు చెల్లించాలి. ఇంపాక్ట్‌ ప్లేయర్‌తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం ఏది తక్కువైతే అది.. ఫైన్‌గా విధించడం జరుగుతుంది. ఒకవేళ ఇదే సీజన్‌లో మూడోసారి తప్పిదానికి పాల్పడితే జరిమానా రూ.30 లక్షలతోపాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధించే ప్రమాదం లేకపోలేదు. పంత్‌ జరిమానాకు సంబంధించి ఇప్పటివరకు ఐపీఎల్‌ కమిటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని