Rishabh Pant: మైదానంలో అడుగుపెట్టిన రిషభ్‌ పంత్‌.. గ్యాలరీ నుంచి స్టాండింగ్ ఒవేషన్‌

Rishabh Pant: రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు గ్యాలరీ నుంచి అభిమానులు చప్పట్లతో స్వాగతించారు.

Published : 23 Mar 2024 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌ రెండో మ్యాచ్‌లో పంజాబ్‌, దిల్లీ జట్లు తలపడ్డాయి. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) పైనే. 15 నెలల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అతడికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

తొమ్మిదో ఓవర్‌లో వార్నర్‌ ఔట్‌ అయిన తర్వాత పంత్‌ బ్యాట్‌ పట్టుకొని క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం అంతా అతడి పేరు మార్మోగింది. గ్యాలరీ నుంచి అభిమానులు లేచి నిల్చొని చప్పట్లతో ఆహ్వానించడంతో కొంతసేపు ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.

2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్‌ దాదాపు 450 రోజుల తర్వాత పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తీవ్రంగా గాయపడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న అతను సౌకర్యంగానే బ్యాటింగ్‌ చేశాడు. అయితే, నేటి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 18 పరుగులతో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన దిల్లీ 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వార్నర్‌ (29), హోప్‌ (33), అభిషేక్ పొరెల్ (32*) రాణించగా.. మిచెల్‌ మార్ష్‌ (20), అక్షర్‌ పటేల్‌ (21) ఫర్వాలేదనిపించారు. హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ చెరో 2, రబాడ, రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్‌ బ్రర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని