Rishabh Pant: పంత్‌ పునరాగమనం అంత సులభం కాదు: మాజీ వికెట్‌ కీపర్‌

ఐపీఎల్‌ 2024లో రిషబ్‌ పంత్‌ పునరాగమనం అంత సులభం కాదని భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు.

Published : 22 Feb 2024 23:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 2024లో రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) పునరాగమనం అంత సులభం కాదని భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ (Parthiv Patel) అన్నాడు. 2022 డిసెంబరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత పంత్‌ ఏడాది మొత్తం క్రికెట్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో మళ్లీ ఒకప్పటిలా ఆడాలంటే అంత సులువైన విషయం కాదన్నాడు. ‘‘పంత్ తిరిగి రావడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. అతనొక ప్రతిభ గల ఆటగాడు. ఎప్పుడు మైదానంలో అడుగుపెట్టినా జట్టును గెలిపించడానికే శ్రమిస్తాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్న పంత్‌ మళ్లీ మునుపటిలా సిక్సర్లు కొట్టడం మనందరం చూస్తామని ఆశిస్తున్నా. కానీ అది అంత సులభం కాదని మనందరికీ తెలిసిందే. చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాడు తిరిగి పుంజుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా సిద్ధమవ్వాలి’’ అని పార్థివ్‌ అన్నాడు. 

2022 డిసెంబరు 30న పంత్‌ కారులో ప్రయాణిస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారుకు మంటలు అంటుకోవడంతో పాటు అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. దాని నుంచి బయటపడ్డ అతడు ఏడాదికాలంగా విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. చివరగా ఐపీఎల్‌ 2022 సీజన్‌లో దిల్లీ తరఫున ఆడిన రిషబ్‌ పంత్‌ 30.91 సగటుతో 340 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మొత్తంలో 98 మ్యాచ్‌లు ఆడి 2,838 పరుగులు చేశాడు. 2024 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తమ మొదటి మ్యాచ్‌ను పంజాబ్‌ కింగ్స్‌తో మొహాలీలో ఆడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు