Rishabh Pant: రిషభ్‌ పంత్ పటాకా పేలుతుందా?

టీ20లైనా, వన్డేలైనా, టెస్టులైనా.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించే రిషభ్ పంత్ (Rihabh Pant) మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.

Published : 15 Mar 2024 16:27 IST

రిషబ్ పంత్ (Rishabh Pant).. ఈ పేరు వింటే భారత క్రికెట్ అభిమానులకు ఒక ఉత్సాహం వస్తుంది. అతను క్రీజులో అడుగు పెట్టాడంటే చాలు.. మెరుపులే మెరుపులు. టీ20లైనా, వన్డేలైనా, టెస్టులైనా.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఎక్కడ ఆడుతున్నా, ప్రత్యర్థి బౌలర్ ఎంతటి వాడైనా అతడికి తెలిసింది బాదడమే. ఈ శైలిలోనే బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్నాడీ ఉత్తరాఖండ్ కుర్రాడు. కానీ ఈ యువ ఆటగాడి జోరుకు రోడ్డు ప్రమాదం బ్రేకులు వేసింది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకుని, తీవ్ర గాయాలకు చికిత్స తీసుకుని, తిరిగి ఆటలో అడుగుపెట్టేందుకు ఎంతో శ్రమించి.. ఎట్టకేలకు అతను పునరాగమనం చేయబోతున్నాడు. మరి ఇకపై ఒకప్పటిలా అతను మెరుపులు మెరిపించగలడా అన్నది ప్రశ్న.

15 నెలల విరామం తర్వాత ఆటలోకి

రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 15 నెలల విరామం తర్వాత పంత్‌ మైదానంలోకి దిగనున్నాడు. అతను 25 ఏళ్ల లోపే అంతర్జాతీయ క్రికెట్లో 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టీ20లు ఆడేశాడు. అన్నింట్లోనూ మంచి సగటు నమోదు చేశాడు. టెస్టుల్లో అతను సాధించిన ఐదు శతకాలూ ఆణిముత్యాలే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అతను ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులోకి అడుగుపెట్టి ప్రత్యర్థి బౌలర్లను బెదరగొట్టి మ్యాచ్‌ ఫలితాలు మార్చేయడం పంత్‌కు అలవాటు. ఐపీఎల్‌లోనూ అతను ఎంతో మెరుగైన ప్రదర్శన చేశాడు.

2016లో పంత్ ఐపీఎల్ కెరీర్ ఆరంభమైంది. అప్పటినుంచి అతను ఢిల్లీ ఫ్రాంఛైజీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో అతను 98 మ్యాచ్‌లు ఆడి 34.61 సగటుతో 2,868 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం, 15 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 128 నాటౌట్. 2021లో ఢిల్లీ కెప్టెన్ అయిన పంత్.. తర్వాతి సీజన్లోనూ జట్టును నడిపించాడు. అయితే ఆ ఏడాది చివర్లో అతను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పంత్‌ను కారు నుంచి బయటికి తీయడంలో కొన్ని నిమిషాలు ఆలస్యం జరిగిఉంటే ప్రాణం పోయేది. ఆ ప్రమాదంలో మోకాలితో పాటు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా డెహ్రాడూన్‌లో చికిత్స చేసి.. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో అత్యవసరంగా ముంబయికి తరలించారు. అతడికి అక్కడ ఒకటికి మించి శస్త్రచికిత్సలు జరిగాయి. 

మునుపటి మెరుపులు అంత తేలిక కాదు

పంత్‌కు అయిన గాయాలు, జరిగిన శస్త్రచికిత్సలు చూశాక అతను మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి రాలేడని అనుకున్నాడట అతడికి చికిత్స చేసిన వైద్యుడు. కానీ నేను ‘మిరాకిల్ మ్యాన్’ అని ఆయనకు చెప్పి సంకల్ప బలంతో కష్టపడ్డాడు పంత్. ఇప్పుడు అతను ఐపీఎల్‌లో ఆడేందుకు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. చికిత్స అనంతరం ఎన్‌సీఏలో ఉండి ఫిట్‌నెస్‌ కోసం కష్టపడిన పంత్.. తాను మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి ఎంత సమయం పడుతుందో అక్కడి వైద్యులను అడిగేవాడట. వాళ్లు ఎంత కాలం అని చెబితే.. దానికి ఆరు నెలలు తగ్గించుకుని అప్పటికల్లా ఫిట్‌గా తయారవ్వాలన్నది పంత్ లక్ష్యం. ఆ ప్రకారమే ఫిజియోలు అంచనా వేసి చెప్పిన దానికంటే కొన్ని నెలల ముందే అతను ఫిట్‌గా మారాడు. ఈసారి ఐపీఎల్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాడు.

మరి ఫామ్ మాటేంటి?

పంత్ ప్రస్తుతానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ముందు ఐపీఎల్‌లో కేవలం బ్యాటర్‌గానే ఆడతాడని వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పుడు వికెట్ కీపింగ్ కూడా చేయడానికి తగ్గ ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో సత్తా చాటితే టీ20 ప్రపంచకప్‌నకు ఆటోమేటిగ్గా ఎంపిక అవుతాడనడంలో సందేహం లేదు. అయితే పంత్ ఫిట్‌నెస్ అయితే సాధించాడు కానీ.. ఫామ్ మాటేంటన్నదే ఇప్పుడు ప్రశ్న. అతను 15 నెలల పాటు ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు దూరం అయ్యాడు. ఇంత విరామం తర్వాత తిరిగి లయ అందుకోవడం అంత తేలిక కాదు. దీనికితోడు ప్రమాదం తాలూకు ప్రభావం శరీరం మీద పడి ఉంటుంది. స్థానభ్రంశం చెందిన మోకాలికి శస్త్రచికిత్సలు జరిగాయి. సుదీర్ఘ విరామం వల్ల పంత్ కొంత బరువు కూడా పెరిగినట్లు కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పంత్ ఐపీఎల్‌లో ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడు.. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో ఏమేరకు రాణిస్తాడు అనే సందేహాలు ఉన్నాయి. అతను ఆరంభంలో కొంచెం తడబడినా అభిమానులు అర్థం చేసుకుంటారు. కానీ లీగ్ మధ్యలో అయినా లయ అందుకుని ఒకప్పటి మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. అంత పెద్ద ప్రమాదం తర్వాత ఆటలోకి పునరాగమనం చేస్తున్న పంత్ మీద అందరి దృష్టి ఉంటుంది. లీగ్‌లో అతను ప్రత్యేక ఆకర్షణ అవుతాడు. అభిమానులు తనకు బ్రహ్మరథం పడతారనడంలో సందేహం లేదు. కానీ అంతిమంగా ఆటతో మెప్పించడమే కీలకం. అదే చేస్తే.. పంత్ సూపర్ హీరో అనిపించుకుంటానడంలో సందేహం లేదు.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని