Rishbh Pant: కెమెరామెన్‌కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్‌ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్‌పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది.

Updated : 25 Apr 2024 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో దిల్లీ మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. కెప్టెన్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లోనే 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. విధ్వంసం సృష్టించిన పంత్‌ ఓ వ్యక్తికి మాత్రం సారీ చెప్పడం గమనార్హం. ఇంతకీ అతడెవరంటే..? బీసీసీఐ కెమెరామెన్ దేబశిశ్. పంత్‌ కొట్టిన బంతి అతడికి తాకింది. దీంతో మ్యాచ్‌ అనంతరం పంత్ స్పందిస్తూ.. ‘‘సారీ దేబశిశ్‌ భాయ్. నిన్ను కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు. వీలైనంత త్వరగా కోలుకుని వస్తావని ఆశిస్తున్నా’’ అని ఓ వీడియోలో వ్యాఖ్యానించాడు. దానిని ఐపీఎల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మ్యాచ్‌లో గెలవడంపై ఆనందం వ్యక్తం చేసిన పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘క్లిష్ట సమయంలో యువ బౌలర్ రసిక్‌కు 19వ ఓవర్‌ ఇవ్వడానికి కారణముంది. ఆన్రిచ్‌ నోకియా గత కొన్ని మ్యాచుల్లో ఇబ్బంది పడ్డాడు. అందుకే, రసిక్‌కు బంతినందించా. రెండో ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ తర్వాత నుంచి బ్యాటింగ్‌ చేయడం తేలికైంది. అందుకే రసిక్‌పై నమ్మకం ఉంచి బౌలింగ్‌ చేయించా. మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేస్తున్న వారిని మనం ప్రోత్సహించాలి.. కెప్టెన్‌గా అది నా బాధ్యత. కొన్నిసార్లు ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు. గుజరాత్‌తో మాత్రం వర్కౌట్ కావడం ఆనందంగా ఉంది. మేం 44/3 స్కోరుతో ఉన్నప్పుడు వారి అత్యుత్తమ స్పిన్‌ విభాగంతో ఆడాల్సిన పరిస్థితి ఎదురైంది. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ వారిని లక్ష్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వందశాతం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తా. నేను కొట్టిన తొలి సిక్స్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని పంత్ తెలిపాడు. 

చివరి ఓవర్‌ వరకూ వచ్చిందంటే..: కుల్‌దీప్‌

‘‘కీలకమైన రెండు పాయింట్లు సాధించడం హ్యాపీగా ఉంది. టోర్నీలో ప్రతి మ్యాచ్‌ మాకు ముఖ్యమే. గుజరాత్‌తో చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ వెళ్లింది. రాహుల్ తెవాతియా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఒక ఓవర్‌ వేయాలని కెప్టెన్, కోచ్‌ సూచించారు. అతడిని ఔట్ చేయగలిగా. బ్యాటర్‌ను అర్థం చేసుకుని.. తగ్గట్టుగా బంతులేస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది. మా బ్యాటర్లు రాణించి 225 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. మా ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేశాం. ప్రత్యర్థి దూకుడుగా ఆడినా ఎక్కడా కంగారు పడలేదు. చివరి రెండు ఓవర్లలో మేం కాస్త అధికంగానే పరుగులు ఇచ్చాం. వారిని 210లోపే కట్టడి చేస్తామని భావించాం’’ అని కుల్‌దీప్‌ వెల్లడించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని