Rishabh Pant: అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్‌కు ఏడాదిన్నర దూరమైంది?

ఐపీఎల్‌లో రిషభ్‌ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. 

Published : 25 Apr 2024 13:47 IST

‘ఇతడికా ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది?’.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రిషభ్‌ పంత్‌ జోరు చూశాక క్రికెట్‌ పండితులు అంటున్న మాట ఇది. వాళ్లన్నదీ కరెక్టే! ఎందుకంటే అతడు ఆడుతున్న భారీ షాట్లు చూస్తే ఎవరికీ అలా అనిపించదు. శరవేగంగా పరుగులు చేస్తున్నాడు. దీంతో ‘పంత్‌కి గ్యాప్‌ వచ్చింది కానీ.. అతడి దూకుడుకు కాదు’ అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న పంత్‌.. ఇక అమెరికా ఫ్లైట్‌ ఎక్కేయడమే అంటున్నారు పరిశీలకులు. 

వారిని తలపిస్తూ.. 

గుజరాత్‌తో మ్యాచ్‌ సందర్భంగా రిషభ్‌ బ్యాటింగ్‌లో ఎంఎస్ ధోనీ, సూర్యకుమార్‌ యాదవ్‌ను గుర్తు చేశాడు. 43 బంతుల్లో 88 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా ఎనిమిది సిక్స్‌లు బాదాడు. అందులోనే ‘హెలికాప్టర్‌’ షాట్‌, సూప్లా సిక్స్‌ ఉన్నాయి. పరుగులు ఇవ్వడంలో పిసినారిగా పేరు తెచ్చుకున్న మోహిత్ శర్మ బౌలింగ్‌నూ ఊచకోత కోశాడు. స్లో డెలివరీలతో ఇబ్బంది పెట్టాలని చూస్తే.. క్రీజు డీప్‌లోకి వెళ్లి.. మరీ భారీ షాట్లు బాదాడు. అలా ఇన్నింగ్స్‌ తుది ఓవర్‌లో 31 పరుగులు లాగేసుకున్నాడు. చిన్న గాయం నుంచి కోలుకుని వచ్చాక ఫిట్‌నెస్‌ సాధించడానికే చాలా కష్టపడాలి. అలాంటిది ప్రాణాంతకమైన యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్నాక అంటే ఇంకా శ్రమించాలి. అంత కష్టపడి జట్టులోకి వచ్చిన పంత్‌.. ఓ మోస్తారుగా ఆడతాడేమో అనుకుంటే... ఒకటిన్నరేళ్ల క్రితం చూపించిన జోరును మించి చూపిస్తున్నాడు. 

మనోధైర్యం ఎక్కువే..

కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తర్వాత ఆ స్థాయిలో ప్రశాంతంగా మైదానంలో కనిపించే ఇండియన్‌ ప్లేయర్లలో పంత్‌ ఒకడు. అదే అతనికి దిల్లీ కెప్టెన్సీని అప్పగించిందని చెబుతుంటారు. మైదానంలో ఎప్పుడూ చిరునవ్వులు చిందించే పంత్‌ను చూస్తే ఒత్తిడి అతడి దగ్గరకు చేరదా? అన్నట్లుగా ఉంటుంది. దానికి ఇప్పుడు మనోధైర్యం కూడా తోడైంది. రోడ్డు ప్రమాదం తర్వాత పంత్‌ తిరిగి క్రికెట్‌ ఆడతాడా? అనే సందేహాలు ఒక దశలో వినిపించాయి. ఒకవేళ ఆడినా మునుపటి జోరు కొనసాగిస్తాడా? అనే ప్రశ్నలూ తలెత్తాయి. వీటన్నింటికీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సమాధానం ఇచ్చాడు. సంకల్ప బలం ఉండాలే కానీ సవాళ్లను దాటడం సులువేనని చెబుతున్నాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌ మాత్రమే చేస్తాడు.. కీపింగ్‌ బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తాడనే వారి నోళ్లు మూయించాడు. 

తొలి ఎంపిక అతడే..!

టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటించే సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే తన ఆటతీరుతో పంత్ టీమ్‌ఇండియాలో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు. కీపర్-బ్యాటర్‌ రేసులో అందరికంటే ముందు నిలిచాడు. ఎడమచేతి వాటం, మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడటం పంత్‌కు కలిసొచ్చే అంశాలు. జూన్ 1 (మనకు జూన్‌ 2) నుంచి వెస్టిండీస్-యూఎస్‌ఏలో పొట్టి కప్‌ ప్రారంభం కానుంది. మన మ్యాచ్‌లు ఎక్కువగా యూఎస్‌ఏలోనే ఉన్నాయి. తొలి ట్రోఫీని (2007) దక్కించుకున్న తర్వాత ఇప్పటి వరకు మళ్లీ భారత్‌కు ఆ టైటిల్‌ దక్కలేదు. ఇక 2013 తర్వాత టీమ్‌ఇండియా ఐసీసీ టోర్నీల్లో జయకేతనం ఎగురవేయలేదు. ఈ పొట్టి కప్‌తో అయినా ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. ఆ దిశగా జట్టుకు పంత్‌ ఎంతో అవసరం. అంతేకాదు రోహిత్‌ తర్వాత టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రేసులో పంత్‌ కూడా ఓ బలమైన పోటీదారుగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు