Riyan Parag: ప్రపంచ కప్‌ను చూడాలని లేదు..: రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు

తనకు జాతీయ జట్టులో స్థానం దక్కలేదని రియాన్‌ పరాగ్‌ అసంతృప్తిని తెలిపే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసి నెట్టింట విమర్శలకు గురవుతున్నాడు.

Published : 03 Jun 2024 10:48 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో ప్రారంభమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించి జోష్‌ మీదుంది. అయితే, జట్టుకు ఎంపిక కాని రియాన్‌ పరాగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు వరల్డ్‌ కప్‌ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో తనకు ఈసారి వరల్డ్‌ కప్‌పై ఆసక్తి లేదని పరాగ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 

‘‘నేను వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండుంటే.. ఏమమవుతుందనే కంగారు ఉండేది. కానీ, ఇప్పుడీ టీమ్‌లో లేను. కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. చాలా మంది టాప్‌-4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లు అవుతుంది. నిజాయతీగా చెప్పాలంటే.. అసలు ఈసారి వరల్డ్‌ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్‌ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు’’ అని పరాగ్ తెలిపాడు. 

ఈ యువ బ్యాటర్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా.. తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ సీజన్‌లో నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. కానీ, మళ్లీ తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది. జాతీయ జట్టులోకి రావడంపైనా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘ఏదో ఒక సమయంలో నన్ను తీసుకొనే పరిస్థితి వస్తుంది. తప్పకుండా భారత జట్టు కోసం ఆడతాననే నమ్మకం ఉంది. అదెప్పుడు అనేది నాకు తెలియదు’’ అని పరాగ్‌ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి కామెంట్లతో నెట్టింట వైరల్‌గా మారాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని