Riyan: అలా ట్వీట్లు చేసే బదులు.. నాకే మెసేజ్‌ చేయొచ్చు కదా..: రియాన్‌ పరాగ్‌

తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన క్రికెట్‌ విశ్లేషకులపై రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) స్పందించాడు.

Published : 07 Jul 2023 17:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌లో విమర్శలు ఎదుర్కొన్న యువ ఆటగాళ్లలో రాజస్థాన్‌ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్  ఒకడు. సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో గతంలో అతడు చేసిన వాటిని గుర్తు చేస్తూ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. నాలుగేళ్ల కిందట ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్‌.. ఇటీవల ముగిసిన సీజన్‌లో ఏడు మ్యాచుల్లో కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు కూడా రియాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిపై రియాన్ పరాగ్ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. 

వీడియో ప్రారంభంలో.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు జోయ్ భట్టాచార్య, వ్యాఖ్యాత హర్షా భోగ్లే సంభాషించుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్‌ రాయల్స్‌ ఐదుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాటర్లు, రియాన్‌ పరాగ్‌తో ఆడింది’’ అని అన్నాడు. వీటిపై రియాన్‌ పరాగ్‌ కాస్త ఘాటుగానే స్పందించాడు. అభిమానులు బాధపడటంలో ఓ అర్థముందని, ఇలాంటి విశ్లేషకులకు ఏమవుతుందో తెలియదని పేర్కొన్నాడు. ఏమైనా ఉంటే నేరుగా తనకే మెసేజ్‌ చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించాడు. 

ఇదీ చదవండి : ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది.. ధోనీకి జడేజా బర్త్‌డే విషెస్

‘‘వెరిఫైడ్‌ ఖాతాలు కలిగిన మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు నా గురించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం కంటే.. నేరుగా నాకే సందేశం పంపితే సరిపోతుంది కదా. ఎవరైనాసరే ‘హాయ్‌,  క్రికెట్‌ ఎలా ఆడగలుగుతున్నావు. ఒకవేళ ఇలా చేస్తే ఇంకాస్త ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’ అని సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తా. అంతేకానీ, సోషల్‌ మీడియాకెక్కి పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సీజన్‌లో చాలా నేర్చుకున్నా. ఓర్పుతో ఎలా ఉండాలనేది తెలుసుకున్నా. నా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే పోస్టులన్నీ నా వ్యక్తిగత జీవితం గురించే ఉంటాయి. 

ఇక ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఆడాలని భావించా. కానీ, తుది జట్టులో నాకు స్థానం దక్కలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా. ఆ మ్యాచ్‌ల కోసం చాలా తీవ్రంగా సాధన చేశా. కష్టపడి సన్నద్ధమయ్యా. రోజు రెండుమార్లు మూడేసి గంటల సెషన్స్‌లో పాల్గొనేవాడిని.  బౌలర్‌గానూ విపరీతంగా శ్రమించా. ఎలాంటి బంతులు వేస్తే వికెట్లు దక్కుతాయనేదానిపై కష్టపడ్డా. మరీ ముఖ్యంగా బెంగళూరుతో ఆడలేకపోయినందుకు చాలా బాధగా అనిపించింది. అలాంటి జట్టుపై ఆడితే అసలైన మజా వస్తుంది. విరాట్ కోహ్లీతో మైదానంలో తలపడటం నాకెంతో ఇష్టం. ఇక వారిని ఓడిస్తే ఆ సంతోషమే వేరు. అయితే అవకాశం రాకపోవడంతో హోటల్‌ గదికి వెళ్లిపోయా. అక్కడే  అద్దంలో నా ముఖం చూసుకుని.. ‘ఈ మ్యాచ్‌ నుంచి నిన్ను తప్పించారు’ అని అనుకున్నా’’ అని రియాన్ పరాగ్ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు