Rajasthan vs Delhi: మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్‌

రాజస్థాన్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Updated : 29 Mar 2024 08:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దిల్లీపై 12 పరుగుల తేడాతో గెలిచింది. యువ ఆటగాడు రియాన్ పరాగ్ (84*) అద్భుత ఆటతీరుతో రాణించాడు. ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, గత రెండు సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలూ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్లీతో మ్యాచ్‌ అనంతరం రియాన్‌ (Riyan Parag) కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘భావోద్వేగాలను నియంత్రించుకోవడం అలవాటైపోయింది. మా అమ్మ ఇక్కడే ఉన్నారు. గత నాలుగేళ్లుగా నా కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. అయితే, నాపై ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. నేను సున్నాకే ఔటైనా అలాగే ఉంటా. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడం కలిసొచ్చింది. ఐపీఎల్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని టాప్‌ -4లో ఒకరు 20 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉంటే ప్రత్యర్థికి భారీ స్కోరును లక్ష్యంగా నిర్దేశించేందుకు అవకాశం ఉంటుంది. తొలి మ్యాచ్‌లో సంజూ చేసిన పని అదే. ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు మూడు రోజులు బెడ్‌పైనే ఉన్నా. పెయిన్‌ కిల్లర్స్‌ను వాడా. రెండో మ్యాచ్‌ కోసం తీవ్రంగా కష్టపడ్డా. ఇప్పుడు ఆ ఫలితం అందుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని రియాన్‌ తెలిపాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కిన విషయం తెలిసిందే. 

వైడ్‌ యార్కర్లు వేయాలని ముందే నిర్ణయించుకున్నా: అవేశ్

‘‘చివరి ఓవర్‌లో నా ప్రణాళిక ఒక్కటే. ఒకవైపు బౌండరీ లైన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వైడ్‌లెంగ్త్‌లో యార్కర్‌ను సంధించాలని అనుకున్నా. ప్రతి బంతి కోసం ఐదు సెకన్లు కేటాయించుకున్నా. ఒకవేళ బ్యాటర్‌ మంచి షాట్‌తో కొట్టినా యార్కర్లను సంధించడంలో వెనక్కి తగ్గకూడదని భావించా. బౌల్ట్, బర్గర్, సందీప్‌ శర్మ వంటి అద్భుత పేస్ బౌలర్లు ఉన్నారు. వారి నుంచి చాలా అంశాలను నేర్చుకుంటున్నా. మా మేనేజ్‌మెంట్‌ కుమార సంగక్కర మద్దతు అద్వితీయం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. టీ20ల్లో విభిన్నంగా బంతులను సంధిస్తే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా’’ అని అవేశ్‌ ఖాన్‌ తెలిపాడు. చివరి ఓవర్‌లో దిల్లీకి 17 పరుగులు అవసరం కాగా.. అవేశ్‌ కేవలం నాలుగు రన్స్‌ మాత్రమే ఇచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని