Virat - Rohit: వేకువజాము మంచులాంటిది ఫామ్‌.. వారి విషయంలో సమస్యే కాదు: సిద్ధూ

విరాట్ - రోహిత్.. టీమ్‌ఇండియా క్రికెట్‌కు మూల స్తంభాలు. వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండో కప్‌ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు.

Updated : 20 Mar 2024 11:12 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట జరిగిన టీ20 ప్రపంచ కప్‌ తర్వాత భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌ మ్యాచ్‌లు ఎక్కువగా ఆడలేదు. అయినా సరే వారిద్దరూ రాబోయే పొట్టి కప్‌లో కీలక పాత్ర పోషిస్తారని క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌ సిద్ధూ వ్యాఖ్యానించాడు. కామెంటేటర్‌గా మళ్లీ పునరాగమనం చేసిన క్రమంలో ఓ చర్చా కార్యక్రమంలో సిద్ధూ మాట్లాడాడు.

‘‘పొట్టి కప్‌లో టాప్‌ ప్లేయర్ల అవసరం ఉంది. ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు. ఫామ్‌ అనేది వారి విషయంలో ఉదయం వేళ వచ్చే మంచులాంటిది. అది త్వరగానే సమసిపోతుంది. క్లాస్‌ ఆటతీరుతో క్రికెట్‌పై తమ ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యుత్తమ భారత క్రికెటర్‌ అనడానికి కారణం అతడి ఫిట్‌నెస్‌ స్థాయి. వయసు పెరిగే కొద్దీ మరింత ఫిట్‌గా మారాడు. మూడు ఫార్మాట్‌లో రాణించగల సత్తా విరాట్ సొంతం. రోహిత్ (Rohit Sharma) పరిస్థితి కూడా ఇలాంటిదే. ఇద్దరూ నాణ్యమైన క్రికెటర్లు. హిట్‌మ్యాన్‌ ఫిట్‌నెస్‌ ఎలా ఉంటుందో తెలియదు. ఏజ్‌ పెరిగే కొద్దీ దూకుడు తగ్గడం సహజం. కానీ, రోహిత్‌ విషయంలో అలా జరగదు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా చివరి వరకూ దూకుడుగా ఆడాడు.

గత కొన్నాళ్లుగా నేను క్రికెట్‌తో టచ్‌ లేనప్పటికీ.. నిశితంగా గమనిస్తూనే ఉన్నా. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ఒకే ఒక్క బ్యాడ్‌ గేమ్‌తో టైటిల్‌ను కోల్పోయింది. దీంతో జట్టు భవిష్యత్తును అంచనా వేయడం సరికాదు. సుదీర్ఘకాలం క్రికెట్‌పై భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించడానికి కారణం వ్యవస్థ బలంగా ఉండటమే. మేం ఆడిన రోజుల్లో ఎవరి ఫామ్‌ బాగోలేకపోయినా పెద్ద సమస్య అయ్యేది కాదు. రిప్లేస్‌మెంట్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌ పాండ్య మెరుగైన ప్రదర్శన చేస్తే భారత జట్టు సారథి అయ్యే అవకాశాలున్నాయి’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని