IND vs BAN Warmup Match: ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్

టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు వార్మప్‌ మ్యాచుల్లో తమ శక్తియుక్తులను ప్రదర్శించుకొనేందుకు అన్ని జట్లూ ఎదురుచూస్తుంటాయి. భారత్‌ కూడా శనివారం బంగ్లాతో వార్మప్‌ ఆడనుంది.

Published : 31 May 2024 19:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సారథ్యంలో తొలి ఐసీసీ ట్రోఫీని అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా సాధన చేస్తోంది. శనివారం భారత్ - బంగ్లాదేశ్‌ (IND vs BAN) జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో రోహిత్‌పై బంగ్లా స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. 

‘‘గత కొన్నేళ్లుగా భారత జట్టును అతడు నడిపిస్తున్న తీరు అద్భుతం. సారథిగా చాలా మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయంగా ప్రతిఒక్కరూ రోహిత్‌ను గౌరవిస్తారు. ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను అమాంతం ఒంటి చేత్తో లాగేయగల సత్తా అతడికుంది’’ అని షకిబ్ తెలిపాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 

న్యూయార్క్‌ పిచ్‌ను పరిశీలించిన రాహుల్ - రోహిత్‌!

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు వేదిక న్యూయార్క్‌లోని నాసౌవ్ స్టేడియం. ఈ పిచ్‌ను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ పరిశీలించారు. వారిద్దరి తొలి అభిప్రాయం ‘పిచ్‌ చూసేందుకు సాధారణంగా ఉంది. బాగుంది’’ అని క్రీడా వర్గాలు తెలిపాయి. పొట్టి కప్‌ కోసం ఇప్పటికే డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను వాడుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఇలాంటి పిచ్‌ మీదనే జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు టీమ్‌ఇండియాకు ఇలా డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. ప్రధాన పోరుకు ముందు సన్నాహక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని