BCCI: బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లు.. ఇషాన్‌, శ్రేయస్ ఔట్‌.. కొత్తగా ఎవరొచ్చారంటే?

బీసీసీఐ సీనియర్‌ పురుష ఆటగాళ్లకు వార్షిక వేతన కాంట్రాక్టులు ప్రకటించింది. దీనిలో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కలేదు. 

Updated : 28 Feb 2024 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ బోర్డు 2023-24 సీజన్‌కు సీనియర్‌ క్రికెటర్ల వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. జాతీయ జట్టుకు ఆడనపుడు దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందరూ అనుకున్నట్లుగానే ఈసారి ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన కిషన్‌ తరువాత జరిగిన ఏ సిరీస్‌లోనూ పాల్గోలేదు. ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యాతో కలసి ప్రాక్టీస్‌ చేశాడని వార్తలొచ్చాయి. రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టు ఆడాలని బీసీసీఐ చెప్పినా ఆడలేదు.  ముంబయి తరఫున అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆడాలని శ్రేయస్‌ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. దీంతో అతనిపైనా వేటు పడింది.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా A+ జాబితాలో నిలవగా రాహుల్‌, గిల్‌, సిరాజ్‌ గ్రేడ్‌ Aకు పదోన్నతి పొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిగా జట్టుకు దూరమైన రిషబ్‌ పంత్‌ B గ్రేడ్‌లో ఉన్నాడు. టీ20 స్టార్‌ రింకూసింగ్, హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ కొత్తగా గ్రేడ్‌ Cలో చోటు దక్కించుకున్నారు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం మూడు టెస్టులు కాని, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే వారిని కూడా గ్రేడ్‌ C లో చేరుస్తారు. ఉదాహరణకు.. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఆడిన ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్ ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టులో పాల్గొంటే వారు కూడా గ్రేడ్‌ C జాబితో చేరుతారు.

ఈ కాంట్రాక్టులు అక్టోబర్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 30, 2024 వరకు అమలులో ఉంటుంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్టును బీసీసీఐ కొత్తగా సిఫార్సు చేసింది. దీనిలో ఆకాశ్‌దీప్‌, విజయ్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యశ్‌ దయాల్‌, విద్వాంత్‌ కావేరప్ప ఉన్నారు.

వార్షిక కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లు వీరే..

గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ A: రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా

గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్

గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్‌ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని