Team India: అదిరిపోయిన ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ ట్విస్ట్‌!

టీ20 ప్రపంచ కప్‌లో భారత ప్రయాణం ఘనంగా మొదలైంది. ఐర్లాండ్‌ను చిత్తు చేసి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Published : 06 Jun 2024 12:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత వన్డే ప్రపంచ కప్‌ సమయంలో జట్టు సభ్యుల్లో జోష్‌ తెప్పించేలా బీసీసీఐ ‘బెస్ట్‌ ఫీల్డర్’ మెడల్‌ను పరిచయం చేసింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫీల్డర్‌కు ఓ మెడల్‌ను బహూకరిస్తూ వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచ కప్‌లోనూ (T2 World Cup 2024) ఇదే సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో ప్రత్యర్థిని కుదేలు చేసింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన వారిని కోచ్ దిలీప్ ప్రకటించారు. అయితే, ఈసారి వినూత్నంగా ఓ అభిమానితో మెడల్‌ ఇప్పించడం విశేషం. 

‘‘టీ20 క్రికెట్‌లో ప్రతి బంతి అత్యంత కీలకం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించాలి. అందకు చక్కటి ఉదాహరణ అక్షర్ పటేల్. క్యాచ్‌ అండ్‌ బౌల్‌ అందుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక విరాట్ కోహ్లీ మైదానంలో కదిలిన విధానం అద్భుతం. ప్రతి ఒక్కరూ తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో సిరాజ్‌నే  ‘ఫీల్డర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది’’ అని దిలీప్ తెలిపాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.  సిరాజ్‌ ఓ యువ అభిమాని చేతులమీదుగా మెడల్‌ను అందుకున్నాడు. అతడిని డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి తీసుకొస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయిన వీడియో వైరల్‌గా మారింది. సుబేక్‌ అనే ఆ కుర్రాడు నేరుగా అర్ష్‌దీప్‌ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత సిరాజ్‌కు చెప్పి మెడల్‌ను అందించాడు.

భారత్‌కు ఆడటం ఎప్పుడూ గర్వకారణమే: గావస్కర్

ఐర్లాండ్‌పై అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శన చేసిన హార్దిక్‌పై సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘జాతీయ జట్టు తరఫున ఆడటం ఎప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. హార్దిక్‌ ఆడుతున్న తీరు అద్భుతం. తన కోటా ఓవర్లను వేసే క్రమంలో ఎక్కడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదు. ఏదో రెండు ఓవర్లు వేసి బ్రేక్‌ తీసుకుందామని భావించలేదు. తనకు తానే పరీక్ష పెట్టుకుని సక్సెస్ అయ్యాడు’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని