IND vs PAK: పిచ్‌ క్యురేటర్‌కూ తప్పని అయోమయం: రోహిత్ శర్మ

డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై ఆడటం సవాల్‌తో కూడకున్నదే. బ్యాటర్లు గాయాలబారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.

Updated : 09 Jun 2024 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో తొలి విజయం సాధించిన భారత్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. న్యూయార్క్‌ వేదికగా పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. అయితే, ఆ పిచ్‌పై ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్‌లో మార్పులు చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. వాటిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాక్‌తో పోరు.. ఏడులో ఆరు భారత్‌వే!

‘‘న్యూయార్క్‌ మా సొంత మైదానం కాదు. ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడాం. పిచ్‌ను అర్థం చేసుకొనేందుకు అది సరిపోదు. ఒక్కో రోజు ఒక్కోలా పిచ్‌ ప్రభావం చూపిస్తోంది. దీంతో పిచ్‌ తయారీలో కీలకమైన క్యురేటర్ కూడా అయోమయానికి గురయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌ ఏ పిచ్‌పై ఆడతామో తెలియదు. అత్యుత్తమ ప్రదర్శన చేసినవారిదే విజయం. అవుట్‌ ఫీల్డ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. కొన్ని సార్లు ఎక్కువ బౌన్స్‌తో బంతి వెళ్తుంది. మరికొన్నిసార్లు పైకే లేవడం లేదు. ఇక వికెట్ల మధ్య పరుగెత్తడం కూడా చాలా ముఖ్యమే. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన క్రికెట్‌ ఆడటమే ముఖ్యం. ప్రత్యర్థి ఎవరు? పిచ్‌ ఎలా ఉంది? అనేవి కీలకం కాదు’’ అని రోహిత్ తెలిపాడు. 

వర్షం ముప్పు ఉందా? 

దాయాదుల మధ్య పోరును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే, మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ, వాతావరణ శాఖ నివేదికలనుబట్టి వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఉన్నప్పటికీ మ్యాచ్‌ నిర్వహణకు అంతరాయం కలగకపోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని