IND vs PAK: పాక్‌తో పోరు.. ఏడులో ఆరు భారత్‌వే!

భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ ఎప్పుడు జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూసే క్రికెట్ అభిమానులు కోకొల్లలు. ఆటగాళ్లకూ ఆ మ్యాచ్‌పై టెన్షన్ ఉంటుందంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.

Published : 08 Jun 2024 19:14 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ చూసేందుకు ఆసక్తిగా ఉండాలంటే సమవుజ్జీలు బరిలోకి దిగాలి. అప్పుడే ఆ మ్యాచ్‌ను ఫ్యాన్స్‌ ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. అలాంటి పోరుల్లో భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ (IND vs PAK) ఒకటి. మళ్లీ టీ20 వరల్డ్‌ కప్‌ పుణ్యామా అని అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఏడుసార్లు జరిగిన పొట్టి కప్‌లో రెండు జట్లు తలపడగా.. ఆరింట్లో భారత్‌ గెలిచింది. ఒకదాంట్లోనే పాక్‌ను విజయం సాధించింది. మరి ఆయా మ్యాచుల్లో ఎవరు సత్తా చాటారో చూద్దాం.. 

  • బౌల్‌ ఔట్: ఎంఎస్ ధోనీ నాయకత్వంలో టీమ్‌ఇండియా గెలిచిన ఏకైక టీ20 వరల్డ్‌ కప్‌. తొలి ఎడిషన్‌ కూడా అదే. డర్బన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘బౌల్‌ ఔట్’ పద్ధతిలో విజయం సాధించింది. రాబిన్ ఉతప్ప (50) ఫిఫ్టీ చేసి రాణించాడు. స్కోర్లు సమం కావడంతో బౌల్‌ ఔట్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. భారత ప్లేయర్లు వరుసగా మూడుసార్లు వికెట్లను పడగొట్టగా.. పాక్‌ ఒక్కసారి కూడా స్టంప్స్‌ తాకలేక ఓటమి పాలైంది. 
  • జోగిందర్ దెబ్బ: ఒకే సీజన్‌లో రెండుసార్లు దాయాది జట్లు ఎదురుపడటం గమనార్హం. గౌతమ్ గంభీర్‌ (75), రోహిత్ శర్మ (30*) బ్యాటింగ్‌లో అదరగొట్టారు. బౌలింగ్‌లోనూ ఇర్ఫాన్‌ పఠాన్ (3/16), ఆర్పీ సింగ్ (3/26) సత్తా చాటారు. చివరి ఓవర్‌లో కేవలం 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే 9 వికెట్లను కోల్పోయిన పాక్‌ను జోగిందర్ శర్మ (2/20) దెబ్బ కొట్టి భారత్‌ను గెలిపించాడు. కేవలం ఏడు రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. 
  • బాలాజీ.. విరాట్: టీ20 వరల్డ్ కప్‌ 2012లో పాక్‌పై భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో లక్ష్మీపతి బాలాజీ (3/22) దెబ్బకు పాక్ 128 పరుగులకే ఆలౌట్‌ కాగా.. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (78*) దుమ్మురేపాడు. సెహ్వాగ్ (29), యువరాజ్‌ (19*) మద్దతుగా నిలిచారు. దీంతో పాక్‌పై పొట్టికప్‌లో హ్యాట్రిక్‌ కొట్టినట్లైంది. 
  • తలో చేయి వేసి..: ధోనీ నాయకత్వంలో మరోసారి పాక్‌పై భారత్ విజయం సాధించింది. తొలుత బౌలర్లు సత్తా చాటారు. పాక్‌ను కేవలం 130/7 స్కోరుకే పరిమితం చేశారు. ఇక టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ (36*), సురేశ్‌ రైనా (35*) శిఖర్ ధావన్ (30), రోహిత్ శర్మ (24) రాణించడంతో భారత్ ఆడుతూపాడుతూ విజేతగా నిలిచింది. 
  • మళ్లీ విరాట్ : భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్‌- 2016 జరిగిన సంగతి తెలిసిందే. కోల్‌కతా వేదికగా టీమ్‌ఇండియా - పాక్‌ మ్యాచ్‌ జరిగింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (55*) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 118/5 స్కోరుకే పరిమితం కాగా.. భారత్ 15.5 ఓవర్లలో నాలుగు వికెట్లను నష్టపోయి 119 పరుగులు చేసి విజయం సాధించింది. 
  • తొలి ఓటమి: ప్రపంచ కప్‌ల చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఎదురైన తొలి ఓటమి. అప్రతిహతంగా సాగిపోతున్న విజయాల పరంపరకు బ్రేక్‌ పడింది. విరాట్ (57), పంత్ (39) రాణించినా.. పాక్‌ ఓపెనర్ల ముందు 152 పరుగుల టార్గెట్‌ సరిపోలేదు. రిజ్వాన్ (79*), బాబర్ అజామ్ (68*) వికెట్‌ ఇవ్వకుండా లక్ష్య ఛేదనను పూర్తి చేసేసి సంచలన విజయం నమోదు చేసింది. భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేక ఇబ్బందిపడ్డారు. 
  • కోహ్లీ వదల్లేదు: రెండేళ్ల కిందట (2022) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు షాన్ మసూద్ (52*), ఇఫ్తికార్ అహ్మద్ (51) హాఫ్ సెంచరీలు సాధించడంతో 159 పరుగులు చేయగలిగింది. హార్దిక్ పాండ్య (3/30), అర్ష్‌దీప్ సింగ్ (3/32) విజృంభించారు. లక్ష్య ఛేదనలో రోహిత్, కేఎల్ విఫలమైనా.. విరాట్ (82*) చివరివరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. హార్దిక్‌ (40) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సరిగ్గా 20 ఓవర్లకు 160 పరుగులు చేసి విజయం సాధించింది. 
  • ఈసారి ఏమైవుతుందో?: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటికే ఐర్లాండ్‌ను ఓడించిన భారత్‌ ఉత్సాహంగా ఉంది. మరోవైపు యూఎస్‌ఏ చేతిలో ఓడి నిరుత్సాహానికి గురైన పాక్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. మరోసారి విరాట్‌తోపాటు కెప్టెన్ రోహిత్, సూర్య కుమార్‌ నుంచి కీలక ఇన్నింగ్స్‌లు రావాలని భారత అభిమానుల కోరిక. బౌలింగ్‌లో బుమ్రాతోపాటు హార్దిక్, అర్ష్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీనిని కొనసాగిస్తే పాక్‌ను ఓడించడం పెద్ద కష్టమేం కాదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు