Rohit Sharma: అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ

పొట్టి కప్‌ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు.

Updated : 18 Apr 2024 12:36 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ కోసం (T20 World Cup 2024) భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్క్వాడ్‌లో ఎవరు ఉంటారు? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఆసక్తిగా మారింది. యువ క్రికెటర్లతోపాటు సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భేటీ అయ్యాడని.. జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను ఎవరినీ కలవలేదని రోహిత్ తాజాగా స్పష్టం చేశాడు. అలాగే ధోనీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలను హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు. ఐపీఎల్‌లో నేడు పంజాబ్‌తో ముంబయి తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు పాల్గొన్నాడు. 

‘‘నేను ఎవరినీ కలవలేదు. అదంతా ఫేక్‌ న్యూస్. అజిత్ అగార్కర్‌ దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడ గోల్ఫ్‌ ఆడేందుకు వెళ్లాడు. రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో సమయం గడుపుతున్నాడు. మేం ఎక్కడా కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఇవ్వాలనుకుంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలిసేలా వెల్లడిస్తాం. కాబట్టి, సోషల్‌ మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇక ధోనీని (MS Dhoni) వరల్డ్‌ కప్‌ కోసం వెస్టిండీస్‌కు వచ్చేలా ఒప్పించడం కష్టమే. ఐపీఎల్‌లో ఆడటం వల్ల అతడు అలసిపోతాడు. తన మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. విండీస్‌కు రాకపోవచ్చు. కానీ, అమెరికాకు వచ్చే అవకాశాలున్నాయి. గోల్ఫ్ ఆడేందుకు వస్తాడని అనుకుంటున్నా. అతడు ముంబయిపై కేవలం నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. అవే మా ఓటమిని ఖాయం చేశాయి’’ అని రోహిత్‌ తెలిపాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌ కప్‌ 2021 సమయంలో భారత జట్టు మెంటార్‌గా ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే.

వారిద్దరిలో ఒకరు కష్టమేనా? 

జూన్‌ 1 నుంచి టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు నాటికి 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించాలి. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంకా సమావేశం కాలేదని రోహిత్ మాటలను బట్టి తెలుస్తోంది. అయితే, ఇప్పటికే జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు మాత్రం బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా జట్టును ఎంపిక చేయాలని కమిటీ భావిస్తోందని సమాచారం. ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోతున్న గిల్, యశస్వి జైస్వాల్‌లో ఒకరిని పక్కన పెట్టే అవకాశాలున్నాయి. రింకు సింగ్‌, శివమ్‌ దూబె జట్టులోకి రావడం పక్కా అని క్రికెట్ విశ్లేషకుల అంచనా. రెండో వికెట్ కీపర్‌ కోసం మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. రిషభ్‌ పంత్‌కు తోడుగా సంజూ లేదా కేఎల్ రాహుల్, జితేశ్‌, ఇషాన్‌లో ఎవరికి అవకాశం వస్తుందో తెలియని పరిస్థితి. అందరూ ఫామ్‌లోనే ఉన్నారు. విరాట్ కోహ్లీని తీసుకోవడం ఖాయమే. కానీ, అతడిని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తారనేది మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ గిల్/జైస్వాల్‌ ఉంటే రోహిత్‌తో వారే ఓపెనింగ్‌ చేస్తారు. అప్పుడు కోహ్లీ వన్‌డౌన్ లేదా సెకండ్‌ డౌన్‌లో ఆడాల్సి ఉంటుంది. దానిపై అతడు కూడా స్పష్టత ఇవ్వాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో జట్టు ఎంపిక దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని