Rohit Sharma: ఐపీఎల్‌ చరిత్రలో.. రోహిత్‌ చెత్త రికార్డు..!

Rohit Sharma: దూకుడైన ఆటతో హిట్‌మ్యాన్‌గా నిలిచిన ముంబయి ఆటగాడు రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌ చరిత్రలో ఎవరూ కోరుకోని రికార్డును తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది.

Published : 02 Apr 2024 12:05 IST

ముంబయి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా మూడో ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది ముంబయి. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా భారీ హిట్టింగ్‌కు కేరాఫ్‌ అయిన ముంబయి.. ఈ సారి బ్యాటింగ్‌లో చతికిలపడింది. రాజస్థాన్‌ బౌలర్లు బౌల్ట్‌, బర్గర్‌ల ధాటికి టాప్‌ఆర్డర్‌ పేకమేడలా కూలింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్‌ డక్‌లుగా వెనుదిరిగారంటే ముంబయి బ్యాటింగ్‌ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తన ఖాతాలో చెత్త రికార్డును వేసుకున్నాడు.

నిన్నటి మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో బౌల్ట్‌ వేసిన ఐదో బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్‌.. సంజూ చేతికి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇన్నింగ్స్‌లో అతడు ఎదుర్కొన్న తొలి బంతి ఇదే. ఐపీఎల్‌ చర్రితలో హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అవడం ఇది 17వ సారి. దీంతో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా బెంగళూరు ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ రికార్డును సమం చేశాడు. వీరి తర్వాత ఈ జాబితాలో పీయూష్‌ చావ్లా, మన్‌దీప్‌ సింగ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 15 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మనీశ్ పాండే, రషీద్‌ ఖాన్‌, అంబటి రాయుడు 14 డకౌట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.


దూసుకొచ్చిన అభిమాని.. కంగారుపడ్డ రోహిత్‌

ఈ మ్యాచ్‌లో భద్రతా వైఫల్యం ఘటన కొంతసేపు కలవరపెట్టింది. ముంబయి ఫీల్డింగ్‌ చేస్తుండగా ఓ అభిమాని స్టాండ్స్‌ నుంచి వేగంగా మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్‌ను చేరుకున్నాడు. అతడిని గమనించని హిట్‌మ్యాన్‌ కంగారుపడి వెనక్కి జరిగాడు. ఆ తర్వాత అభిమానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి పంపించాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని బయటకు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని