Rohit Sharma: సిక్సర్లందు రోహిత్‌ సిక్సర్లు వేరయా!

పిచ్‌ ఎలా ఉన్నా.. బౌలర్లు ఎంత ప్రమాదకరమైనా.. అతను అనుకుంటే చాలు బంతి అభిమానుల మధ్యలో పడాల్సిందే. క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ సిక్సర్‌ కొట్టడం అంత సులువైన విషయం కాదు. ఒక్కసారి బంతిని తప్పుగా అంచనా వేశారంటే అంతే వికెట్‌ సమర్పించుకోవాల్సిందే. అయితే రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో కచ్చితత్వంతో కూడిన సిక్స్‌లే ఎక్కువ.

Updated : 30 Sep 2023 10:58 IST

హిట్‌మ్యాన్‌ బాదుడే వేరు

అంతర్జాతీయ క్రికెట్లో బంతిని బాదేవాళ్లు ఎంతో మంది! బ్యాట్‌తో విధ్వంసం సృష్టించే వాళ్లు ఎంతో మంది! అద్భుతమైన బ్యాటింగ్‌తో అలవోకగా సిక్సర్లు కొట్టే బ్యాటర్లు గతంలో ఉండేవాళ్లు. ఇప్పుడూ ఉన్నారు. ఇక ముందు కూడా వస్తారు. కానీ అతడిలాగా బంతిని స్టాండ్స్‌లోకి పంపే ఆటగాడు మాత్రం మరొకరు వస్తారా? అంటే అవుననే సమాధానం చెప్పడం కష్టమే. బంతిపై ఏదో కోపం ఉన్నట్లు.. బౌలర్లపై కక్ష పెంచుకున్నట్లు.. బంతి మైదానంలో కనిపించడమే నచ్చనట్లు.. అతడు చెలరేగిపోతాడు. పిచ్‌ ఎలా ఉన్నా.. బౌలర్లు ఎంత ప్రమాదకరమైనా.. అతడు అనుకుంటే చాలు బంతి అభిమానుల మధ్యలో పడాల్సిందే. లేకపోతే వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 551 అంతర్జాతీయ సిక్సర్లు అతడి ఖాతాలో చేరేవా? ప్రపంచ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచేందుకు మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్న అతడే.. రోహిత్‌ శర్మ (Rohit Sharma). సిక్సర్లందూ ఈ టీమ్‌ఇండియా కెప్టెన్‌ కొట్టే సిక్సర్లు వేరనే చెప్పాలి. 

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్ల రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ పేరు మీద ఉంది. ఈ విధ్వంసక ఆటగాడు 553 సిక్సర్లు కొట్టాడు. జాబితాలో ఆ తర్వాతి స్థానం రోహిత్‌ శర్మదే. రోహిత్‌ ఇప్పటివరకూ 551 సిక్సర్లు సాధించాడు. మరో మూడు సార్లు బంతిని స్టాండ్స్‌లో పడేస్తే.. రోహిత్‌ అగ్రస్థానాన్ని అధిరోహిస్తాడు. మూడు ఫార్మాట్లలో కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 550 సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్‌దే. కేవలం 471 ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ మైలురాయి చేరుకున్నాడు. క్రిస్‌ గేల్‌కు 548 ఇన్నింగ్స్‌లు పట్టాయి. దీన్ని బట్టి సిక్సర్ల కొట్టడంలో రోహిత్‌ దూకుడు అర్థం చేసుకోవచ్చు. అందుకే అతణ్ని సిక్సర్ల శర్మ అని పిలవడంలోనూ తప్పు లేదు. 

అలవోకగా..

క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ సిక్సర్‌ కొట్టడం అంత సులువైన విషయం కాదు. ఒక్కసారి బంతిని తప్పుగా అంచనా వేశారంటే అంతే వికెట్‌ సమర్పించుకోవాల్సిందే. సిక్సర్లు కొట్టాలంటే టైమింగ్‌ గొప్పగా ఉండాలి. పిచ్‌ పరిస్థితులపై అంచనా ఉండాలి. బ్యాట్‌ స్వీట్‌ స్పాట్‌ను ముద్దాడేలా బంతిని కొట్టగలగాలి. సిక్సర్లు కొట్టడంలో ఒక్కో బ్యాటర్‌ది ఒక్కో స్టైల్‌. కానీ రోహిత్‌ది మాత్రం భిన్నమైన శైలే. చిన్నప్పుడు కండరాల బలం లేకపోయినా బంతిని బలంగా బాదాలనుకునేవాడు. కానీ క్రికెట్‌ కెరీర్‌ మొదలెట్టిన తర్వాత గాల్లో షాట్లు ఆడాలంటే టైమింగ్‌ ముఖ్యమని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కచ్చితమైన టైమింగ్‌తో బంతిని స్టాండ్స్‌లో పడేస్తున్నాడు. అందరి బ్యాటర్లకంటే బంతిని బాదేందుకు రోహిత్‌కు 1.5 సెకన్ల సమయం ఎక్కువగా ఉంటుందని కోహ్లి పొగిడాడంటేనే హిట్‌మ్యాన్‌ టైమింగ్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆ షాట్‌.. 

ఇక అలవోకగా సిక్సర్లను కొట్టేందుకు అతడు ఎక్కువగా ఆడే పుల్‌ షాట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతి కాస్త ఎత్తులో వచ్చిందా ఇక దాని గమ్యస్థానం బౌండరీ బయటే. క్రీజులో బలంగా నిలబడి.. బంతిని అమాంతం ఎత్తి స్క్వేర్‌లెగ్‌ మీదుగా బయట పడేస్తాడు. అద్భుతమైన టెక్నిక్‌తో చేతులు, మణికట్టు, భుజాల నుంచి బలాన్ని రాబట్టి గట్టిగా బంతిని కొడతాడు. రోహిత్‌ వికెట్‌ కోసం డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో ఫీల్డర్‌ను మోహరించి.. పుల్‌ షాట్‌ ఆడేలా బౌలర్లు అతణ్ని ప్రేరేపిస్తారు. ఫీల్డర్లు ఉన్నా సరే.. వీళ్ల పై నుంచి బంతిని పంపిస్తాడు రోహిత్‌. బంతి కాళ్ల ముందు పడిందా.. క్రీజు వదిలి ముందుకొచ్చి బౌలర్‌ తలమీదుగా బౌండరీ దాటిస్తాడు. ఇవే అని కాదు మైదానంలో అన్ని వైపులా సిక్సర్లు కొట్టే సామర్థ్యం రోహిత్‌ సొంతం. వన్డేల్లో 250కి పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఓపెనర్‌ అతడే. ఇప్పటివరకూ టెస్టుల్లో 77, వన్డేల్లో 292, టీ20ల్లో 182 సిక్సర్లను రోహిత్‌ కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డూ అతడిదే. వన్డేల్లో షాహిద్‌ అఫ్రిది (351), క్రిస్‌ గేల్‌ (331) తర్వాత మూడో స్థానంలో రోహిత్‌ ఉన్నాడు. ఇప్పటివరకూ వన్డేల్లో మరే బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో హిట్‌మ్యాన్‌ మూడు సార్లు డబుల్‌ సెంచరీలు చేయడం వెనుక సిక్సర్లు బాదే అతడి నైపుణ్యం ఎంతో కీలకమో అర్థం చేసుకోవచ్చు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు