Rohit Sharma: విండీస్‌ పర్యటన తర్వాత రోహిత్ టెస్ట్‌ కెప్టెన్సీకి ఎసరు?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) ఓటమి తర్వాత విమర్శకుల టార్గెట్‌ రోహిత్ శర్మ (Rohit Sharma). జట్టును సరైన మార్గంలో నడిపించలేకపోతున్నాడని, వ్యక్తిగత  ప్రదర్శన కూడా ఘోరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. 

Published : 14 Jun 2023 14:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) ఓటమితో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, వెస్టిండీస్‌ పర్యటనకు ప్రకటించిన టీమ్‌ను రోహిత్ శర్మే ముందుండి నడిపిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. విండీస్‌ పర్యటన తర్వాత మాత్రం టెస్టుల్లో రోహిత్‌ కెప్టెన్సీపై నీలిమేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంతోపాటు భారీగా పరుగులు సాధించాల్సి ఉంది. ఒకవేళ విండీస్‌ పర్యటనలో విఫలమైతే మాత్రం రోహిత్‌ విషయంలో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి రావడం తథ్యమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, బీసీసీఐ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి.

‘‘రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే వాదనకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, 2025 నాటికి మూడో డబ్ల్యూటీసీ సీజన్‌ ముగుస్తుంది. అప్పటి వరకు అతడు కొనసాగుతాడా..? లేదా..? అనేది తెలియాలి. ఎందుకంటే అప్పటికి రోహిత్‌ వయసు 38కి చేరుతుంది. శివ్‌సుందర్‌ దాస్ నేతృత్వంలోని సెలెక్టర్ల కమిటీ విండీస్‌తో రెండు టెస్టుల తర్వాత రోహిత్ ఫామ్‌ను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు. కానీ, విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ముగిశాక.. డిసెంబర్‌ వరకు భారత్‌ టెస్టులు ఆడదు. కాబట్టి, ఇప్పుడే తొందరపడి నిర్ణయం మాత్రం వెలువరించకపోవచ్చు. చర్చించి నిర్ణయానికి వచ్చేందుకు తగినంత సమయం ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని