Rohit Sharma: ఇది అత్యుత్తమ జట్టే.. ఆ ప్రశ్నకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పా: రోహిత్

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కోసం భారత జట్టును ప్రకటించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ జర్నలిస్ట్‌పై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక విషయాలపై స్పందించాడు.

Updated : 05 Sep 2023 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ (ODi World Cup 2023) కోసం భారత్‌ తన జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్‌ అగర్కార్‌ వెల్లడించాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆసియా కప్‌ కోసం శ్రీలంకలో ఉన్న విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించి మరీ జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ తన జట్టుపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు. 

అద్భుతమైన టాలెంట్ ఉంది.. 

‘‘క్రికెట్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌ చాలా విభిన్నంగా ఉంటుంది. నిలకడగా ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు పెంచాల్సి ఉంటుంది. వచ్చే వరల్డ్‌ కప్‌లో 9 లీగ్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతిసారి మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి. గత వరల్డ్‌ కప్‌లో ఇలాగే ఇంగ్లాండ్‌ విజేతగా నిలవడం చూశాం. ఈసారి ఆయా జట్ల కాంబినేషన్‌, వ్యూహాలు, ప్రణాళికలపై ఆలోచించడానికి అదనపు సమయం ఉంది. తప్పకుండా ఈసారి మేం అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. బలమైన జట్టును తయారు చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రపంచ కప్‌ కోసం 15 మందిని ఎంపిక చేయడం కఠిన సవాలే. 

అనుకున్నట్లే ఆ ముగ్గురికీ దక్కని చోటు.. వన్డే ప్రపంచ కప్‌నకు భారత జట్టు ఇదే..

లోతైన బ్యాటింగ్‌ విభాగంతోపాటు స్పిన్, పేస్ బౌలింగ్‌ వనరులతో వన్డే ప్రపంచకప్ ఆడబోతున్నాం. అయితే, తుది జట్టు ఎలా ఉంటుందనేది ఇప్పటికప్పుడే చెప్పలేం. మ్యాచ్‌ రోజు పరిస్థితులను బట్టి ఎంపిక ఉంటుంది. ప్రత్యర్థి విసిరే సవాల్‌ను అనుసరించి తుది జట్టుతో బరిలోకి దిగుతాం. కొందరు వరల్డ్‌ కప్‌ సెలెక్షన్‌లో లేకపోవచ్చు. భారత్‌లో అద్భుతమైన టాలెంట్‌కు కొదువలేదనేదానికి ఇదొక నిదర్శనం. కానీ, 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రపంచ కప్‌ సందర్భంగా జట్టు ఎంపికలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. ఇప్పుడేమీ సర్‌ప్రైజ్‌ లేదు’’ అని రోహిత్ తెలిపాడు. 

బయట ఏం జరుగుతుందనేది అనవసరం

ప్రెస్ కాన్ఫెరెన్స్ సందర్భంగా ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నపై రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మెగా టోర్నీల్లో భారత్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటిపై మీ స్పందనేంటని సదరు జర్నలిస్ట్ అడిగాడు. దానికి రోహిత్ కాస్త ఘాటుగా స్పందించాడు. ఇలాంటి ప్రశ్నలను తానెప్పుడూ ప్రోత్సహించనని, ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్‌ కోసం బయల్దేరకముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చా.  బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా మేం పట్టించుకోం. జట్టులోని ప్రతి ఆటగాడు ప్రొఫెషనల్‌ క్రికెటరే. ఇలాంటి ప్రశ్నలు మళ్లీ అడగొద్దు. ఇలాంటి విషయాలపై స్పందించడం కూడా సరైంది కాదు. ప్రస్తుతం మా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. ఇలాంటి విషయాలను పట్టించుకోం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని