Rohit Sharma: వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమి.. అప్పుడు రితికాను ఆ మాట అడిగా: రోహిత్ శర్మ

వన్డే వరల్డ్‌ కప్‌ ఓటమి తాలూకా బాధ ఇప్పటికీ కెప్టెన్ రోహిత్‌ను వెంటాడుతూనే ఉంది. తాజాగా టీ20 ప్రపంచ కప్‌లో బోణీ కొట్టిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 06 Jun 2024 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. ఐర్లాండ్‌ను చిత్తు చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. పొట్టి కప్‌ మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌ను చాటాడు. అయితే, వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ ఓటమి తనను అప్పుడప్పుడు కలవరానికి గురి చేస్తోందని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఫైనల్‌లో ఓటమి తర్వాత రోజు పొద్దున్న వచ్చిన కల గురించి తన భార్య రితికాకు చెప్పిన విషయాన్ని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. 

‘‘వరల్డ్ కప్‌ ఫైనల్‌ జరిగిన తర్వాత రోజు ఉదయం నిద్ర లేచా. ఆ రాత్రి మనం ఓడిపోయినట్లు చెడ్డ కల వచ్చింది. ఇలాగే జరుగుతుందంటావా?అయినా రేపు కదా మనం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సింది’ అని రితికాతో అన్నా. కాసేపటికి మనం ఓడిపోయామని గ్రహించా. నాలుగైదు రోజులపాటు ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయా. ఫైనల్‌ మ్యాచ్‌ వరకు మేం వరుస విజయాలతో దూసుకొచ్చాం. సరైన దారిలోనే ఉన్నాం. కప్ అందుకొనేందుకు చేరువగా వచ్చారని అంతా భావించారు. కానీ ఫైనల్‌లో ఓటమిపాలయ్యాం. దీంతో అక్కడ ఉండేందుకు మనసు అంగీకరించలేదు. త్వరగా కార్యక్రమం ముగించి వెళ్లిపోదామని అనుకున్నా. తీవ్ర నిరుత్సాహంలో ప్రతి క్రికెటర్ ఉన్నాడు. అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఆ సమయంలో అర్థం చేసుకోలేం. అంతటి కోపం, నిరాశ ఎదురయ్యాయి’’ అని రోహిత్ తెలిపాడు. 

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం టీమ్‌ఇండియాకు చేజారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని