Rohit Sharma: హై హై నాయకా.. వరల్డ్‌ కప్‌ ‘హిట్‌మ్యానే’ వేరు..!

ఆసీస్‌తో పోరాడి గెలిచిన భారత్‌.. అఫ్గాన్‌తో మాత్రం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయ సాధించింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా పాయింట్ల పట్టికలో ద్వితీయ స్థానానికి దూసుకుపోయింది. ఇలా అఫ్గాన్‌పై భారీ విజయం సాధించడంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక పాత్ర పోషించాడు.

Updated : 12 Oct 2023 10:06 IST

అతడు పది ఓవర్లు క్రీజ్‌లో ఉంటేనే మ్యాచ్‌పై ప్రత్యర్థులు ఆశలు వదులుకోవాల్సిందే. ఇక కుదురుకున్నాడంటే ఆ రోజు చాలా రికార్డులు గల్లంతైనట్లే. అలవోకగా సిక్స్‌లు కొట్టేయగల సమర్థుడు. ఇక ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) అంటే గాడ్‌ మోడ్‌లోకి మారిపోతాడు. మెగా సమరంలో పరుగుల ఎలా పారించాలో అతడికి బాగా తెలుసు. ఇంత పెద్ద టోర్నీకి తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా.. ఎక్కడా ఆ ఒత్తిడి కనిపించలేదు. ఇప్పటికే అర్థమైపోయిందిగా ఎవరా అతడని? మన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma). 

అఫ్గాన్‌పై భారీ సెంచరీతో రోహిత్‌ మళ్లీ భారత్‌కు ఊపు తెచ్చాడు. ఒక్క మ్యాచ్‌తో ఎన్నో రికార్డులను తన ఖాతాలో జమచేసుకొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఇన్‌స్వింగర్‌కు బలైనా.. ఆ ప్రభావం ఈ మ్యాచ్‌లో ఎక్కడా కనిపించలేదు. బ్యాట్‌తో అఫ్గాన్‌పై విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో వరల్డ్‌ కప్‌లోనే భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. దాదాపు 40 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును చెరిపేశాడు. ఇప్పటికే సచిన్‌, క్రిస్‌ గేల్‌ రికార్డులను కూడా అధిగమించాడు. కీలక సమయంలో అద్భుత ఫామ్‌ను అందిపుచ్చుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. 

వరల్డ్‌ కప్‌ల్లో విధ్వంసం.. 

ద్వైపాక్షిక సిరీసుల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. అయితే, బ్యాటర్‌గా వన్డే ప్రపంచ కప్‌ మెగా టోర్నీల్లో అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు ఆడేది మూడో వరల్డ్‌ కప్‌ అయినా సరే.. ఐదు ప్రపంచకప్‌లు ఆడిన వారికి కూడా సాధ్యం కాని విధంగా ఏడు సెంచరీలను నమోదు చేశాడు. అందుకే, విరాట్ కోహ్లీ లక్ష్య ఛేదనలో కింగ్‌ అయితే.. రోహిత్ ‘వరల్డ్‌ కప్‌ హీరో’ అనడంలో సందేహం లేదు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఏడు శతకాలు బాదడం చూస్తేనే.. అతడి విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో తెలుస్తోంది. ఇందులో మూడు సెంచరీలు లక్ష్యఛేదన సమయంలోనే కావడం విశేషం. ప్రస్తుతం అతడి ఫామ్‌ను చూస్తుంటే ఈ టోర్నీలో శతకాల సంఖ్య 10కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2015 వరల్డ్‌ కప్‌లో ఒకటి, 2019లో ఏకంగా ఐదు సెంచరీలు సాధించాడు. 

సిక్స్‌లు అలా కొట్టేందుకు కారణమదే..

రోహిత్ శర్మ సిక్స్‌లను అలవోకగా కొడతాడని మనకు తెలుసు. తాజాగా అఫ్గాన్‌పైనా ఐదు సిక్స్‌లు బాదేశాడు. ఇతర బ్యాటర్లతో పోలిస్తే బంతిని కాస్త ముందుగానే అంచనా వేసి షాట్‌ కొట్టడంలో రోహిత్ దిట్ట. దీనింతటికి కారణం అద్భుతమైన అతడి టైమింగ్‌. ఇదేదో బయట నుంచి చూసిన వారు చెప్పింది కాదు. స్వయంగా రోహిత్ శర్మనే వెల్లడించాడు. నాలుగేళ్ల కిందట బంగ్లాతో జరిగిన ఓ మ్యాచ్‌ అనంతరం యుజ్వేంద్ర చాహల్‌తో మాట్లాడుతూ.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సిక్స్‌లు కొట్టాలంటే భారీ శరీరం ఉండక్కర్లేదు. నువ్వైనా (చాహల్‌ను) సిక్స్‌లు కొట్టేయచ్చు. అయితే, దానికి కావాల్సింది టైమింగ్‌. బంతిని సరిగ్గా అంచనావేసి హిట్‌ చేస్తే చాలు. బ్యాట్‌కు మధ్యలో తగలాలి. అందుకే, సిక్స్‌ బాదాలంటే కొన్ని విషయాలపై సాధన చేయాలి’’ అని రోహిత్ చెప్పాడు. 

ఇదొక్కటి సాధిస్తే..

భారత్ దాదాపు పదేళ్ల నుంచి ఐసీసీ టైటిల్‌ కోసం నిరీక్షిస్తోంది. చివరి సారిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో (2013) ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా దక్కించుకుంది. అంతకుముందు 2011వరల్డ్‌ కప్‌ను కూడా ధోనీ సారథ్యంలో సాధించింది. ఆ తర్వాత వన్డే, టీ20 ప్రపంచకప్‌లు జరిగినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఈసారి మాత్రం అన్నీ శుభ శకునాలే. తాజాగా ఆరు దేశాలు తలపడిన ఆసియా కప్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టే నాటికి మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌ అయింది. ఇటు రాహుల్‌ వంటి ఆటగాళ్లూ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చేశారు. వరల్డ్‌ కప్‌లోనూ శుభారంభం లభించింది. ఇదే ఒరవడిని కొనసాగించి ముచ్చటగా మూడో వరల్డ్‌ కప్‌ను రోహిత్ నాయకత్వంలో జట్టు ముద్దాడాలని భారతావని కోరుకుంటోంది.

-ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని