MS Dhoni: ధోని నిర్ణయంపై రోహిత్‌ స్పందనిదే..

MS Dhoni: సీఎస్కే కెప్టెన్‌గా ధోని తప్పుకోవడంపై రోహిత్‌ శర్మ స్పందించాడు. మరోవైపు కొత్తగా ఆ జట్టు సారథ్య బాధ్యతలు తీసుకోనున్న రుతురాజ్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ విలువైన సూచన చేశాడు.

Updated : 22 Mar 2024 08:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎం.ఎస్‌.ధోని (MS Dhoni). జట్టు సారథిగా అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన ఈ కెప్టెన్‌ కూల్‌.. నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024 (IPL 2024) ప్రారంభానికి ఒక్క రోజు ముందు తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపర్చాడు. అతని నిర్ణయంపై ముంబయి ఇండియన్స్ మాజీ సారథి రోహిత్‌ శర్మ స్పందించాడు.

రోహిత్‌ షేక్‌హ్యాండ్‌..

ధోని నిర్ణయం వెలువడిన కాసేపటికే అతడితో ఉన్న బంధాన్ని రోహిత్‌ (Rohit sharma) తన ఇన్‌స్టా అప్‌డేట్‌లో ఓ పొటోతో పంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇరువురూ చేయి చేయి కలుపుతున్న దృశ్యాన్ని షేర్‌ చేశాడు. కింద షేక్‌హ్యాండ్‌ ఎమోజీని ఉంచాడు. మరోవైపు ఈ సీజన్‌ నుంచి ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోని నిర్ణయంపై రోహిత్‌ స్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది.

దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది..

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం ధోని నిర్ణయంపై స్పందించాడు. కెప్టెన్‌ కూల్‌ నాయకత్వం దశాబ్దాలపాటు నిలిచిపోతుందని ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న క్రికెట్‌ గెలాక్సీలో సీఎస్కే సారథిగా ధోని వారసత్వం ఓ ఉజ్వల తారలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఫ్రాంచైజీకి మార్గాన్ని చూపుతుంది. అతడి నాయకత్వం దశాబ్దాలపాటు గుర్తుండిపోతుంది. CSK లీడర్‌గా కొత్తగా బాధ్యతలు తీసుకోనున్న రుతురాజ్‌కు శుభాకాంక్షలు’’ అని ఇర్ఫాన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. 

IPL 2024: ఎండల్లో హాయ్‌ హాయ్‌

ధోని ఎప్పటికీ నాయకుడే..

మరోవైపు భారత జట్టు మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం ధోనీని ప్రశంసించాడు. అతడు వ్యవహరించే విధానం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఎలాంటి గందరగోళం లేకుండా నిష్క్రమించాడని అభిప్రాయపడ్డాడు. ధోని ఎప్పటికీ నాయకుడే అని కొనియాడాడు.

పెద్ద బాధ్యతే: సూర్యకుమార్‌

సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరించనున్న రుతురాజ్‌ గైక్వాడ్‌కు ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ శుభాకాంక్షలు తెలుపుతూనే బాధ్యతలను గుర్తుచేశాడు. ‘‘ధోని స్థానాన్ని భర్తీ చేసే పెద్ద బాధ్యత నీపై ఉంది. నీ ప్రశాంత స్వభావంతో జట్టు వారసత్వాన్ని నీదైన శైలిలో ముందుకు తీసుకెళ్తావని నమ్ముతున్నాను. అందరి ప్రేమ, ఆశీస్సులు నీకు దక్కాలని కోరుకుంటున్నా’’ అని సూర్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశాడు.

చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్‌-17 ఆరంభానికి ఒక రోజు ముందు ధోని ప్రకటించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి సీజన్‌ కావొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. చెన్నైతో అతడిది విడదీయరాని బంధం. ఆటగాడిగా నిష్క్రమించినా ఏదో ఒక పాత్రలో సీఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని