WPL 2024: డబ్ల్యూపీఎల్‌.. 2 పరుగుల తేడాతో యూపీపై ఆర్‌సీబీ విజయం

మహిళా క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌ రెండో మ్యాచ్‌లోనూ అభిమానులకు క్రికెట్‌ మజాను రుచి చూపించారు.

Updated : 24 Feb 2024 23:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్ 2024 సీజన్‌లో రెండో మ్యాచ్‌ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (UPW vs RCB) రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 155/7 స్కోరుకే పరిమితమైంది. శోభనా ఆశా 5 వికెట్లు తీసి యూపీని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లను పడగొట్టింది. దీంతో యూపీ లక్ష్యఛేదన కష్టంగా మారింది. 

శోభనా ఆశా అదుర్స్.. 

బెంగళూరు నిర్దేశించిన లక్ష్యం పెద్దదేమీ కాదు. కానీ, యూపీ వారియర్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో మాత్రం ఆర్‌సీబీ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ప్రమాదకరమైన బ్యాటర్ ఎలీసా హీలేను (5)ను ఔట్‌ చేసి మోలినెక్స్‌ వికెట్ల పతనానికి తెరలేపింది. ఆ తర్వాత శోభనా ఆశా చెలరేగిపోయింది. కీలకమైన వ్రిందా దినేశ్‌ (18), తహ్లియా మెక్‌గ్రాత్ (22), గ్రేస్ హారిస్‌ (38), శ్వేతా షెహ్రవాత్‌ (31), కిరణ్‌ నవ్‌గిరె (1) వికెట్లను తీసింది. పూనమ్ ఖెమ్నర్ (14), దీప్తి శర్మ (13*) కాస్త దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. అయితే, చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. ఆర్‌సీబీ బౌలర్‌ మోలినెక్స్‌ కేవలం 8 పరుగులే ఇచ్చింది. దీంతో బెంగళూరు ఖరారైంది. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా శోభనా నిలిచింది.

మేఘన, రిచా హాఫ్‌ సెంచరీలు..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన (13), సోఫీ డివైన్ (1) విఫలమయ్యారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53: 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్‌ (62: 37 బంతుల్లో 12 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఎలీసా పెర్రీ 8, సోఫీ 9*, శ్రేయాంక పాటిల్ 2* పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2.. గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ ఎక్లెస్లోన్, దీప్తి శర్మ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని