RCB vs UPW: మెరిసిన ఆర్‌సీబీ బ్యాటర్లు మేఘన, రిచా ఘోష్‌.. యూపీ విజయలక్ష్యం 158

యూపీ వారియర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆర్‌సీబీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించలేకపోయారు.

Published : 24 Feb 2024 21:02 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) రెండో సీజన్‌లో యూపీ వారియర్స్‌ జట్టుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 158 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన (13), సోఫీ డివైన్ (1) విఫలమయ్యారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53: 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్‌ (62: 37 బంతుల్లో 12 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. 

స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయిన బెంగళూరును తొలుత మేఘన ఆదుకుంది. 54 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయిన సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రిచా ఘోష్‌తో కలిసి మేఘన కీలక భాగస్వామ్యం నిర్మించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే క్రమంలో మేఘన ఔటైంది. ఆ తర్వాత రిచా ఘోష్‌ వేగం పెంచింది. వరుసగా బౌండరీలతో చెలరేగిపోయింది. అయితే, దీప్తి శర్మ బౌలింగ్‌లో రిచా బౌల్డయింది. మిగతా ఆర్‌సీబీ బ్యాటర్లు ఎలీసా పెర్రీ 8, సోఫీ 9*, శ్రేయాంక పాటిల్ 2* పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2.. గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ ఎక్లెస్లోన్, దీప్తి శర్మ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని