Yash Dayal: ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్‌ గ్రూప్‌ల్లోంచి బయటికి వచ్చాం’

చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్‌ దయాల్‌ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్‌లు ఇచ్చి తీవ్ర  విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. 

Published : 21 May 2024 00:07 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌ మొదట్లో వరుస పరాజయాలతో డీలాపడిన ఆర్సీబీ.. రెండో దశలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. చెన్నైతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నై క్వాలిఫై కావడానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కొట్టాలి. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌ బంతిని యశ్‌ దయాల్‌ (Yash Dayal)కు అందించడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమనుకున్నారు చాలామంది. అందుకు ఓ కారణం ఉంది. గతేడాది యశ్ దయాల్ గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించి కోల్‌కతాతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు సమర్పించుకుని జట్టు ఓటమికి కారణమయ్యాడు. రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. క్రీజులో ధోనీ, జడేజా ఉండటంతో మళ్లీ ఆ సీన్ రిపీట్ అవుతుందేమోనని ఆర్సీబీ ఫ్యాన్స్‌ కంగారుపడ్డారు. తొలి బంతికే ధోనీ సిక్స్‌ బాదినా యశ్ దయాల్ ఒత్తిడికి గురికాలేదు. తర్వాతి బంతికే మహీని ఔట్ చేశాడు. తర్వాత నాలుగు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. గతేడాది జిరోగా మారిన యశ్ ఈ ఓవర్‌తో హీరో అయ్యాడు. 

2024 సీజన్‌కు గుజరాత్‌ యశ్‌ దయాల్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసింది. మినీ వేలంలో ఆర్సీబీ యశ్‌ను రూ.5 కోట్లకు దక్కించుకుంది. దీంతో అతడిని లక్ష్యంగా చేసుకుని మీమ్స్‌తో నెట్టింట ట్రోల్ చేశారు. యశ్‌ను తీసుకుని బెంగళూరు రూ.5 కోట్లు వృథా చేసిందంటూ కామెంట్లు, పోస్టులు పెట్టారు. ఇటీవల యశ్ దయాల్ తండ్రి చందర్‌పాల్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్‌ తరఫున యశ్ దయాల్ ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు ఇచ్చిన తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న అవమానాల గురించి వివరించారు. 

‘‘నేను ఉన్న ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో నాకు తెలిసిన ఒక వ్యక్తి యశ్‌ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్‌ని షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ హేళన చేసేలా ఆ మీమ్‌ ఉంది. నాకు ఇప్పటికీ గుర్తుంది ‘‘ప్రయాగ్‌ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కాకముందే ముగిసింది’’ అని ఆ మీమ్‌లో రాసుకొచ్చాడు. ఆ ట్రోలింగ్ అంతటితో ఆగిపోలేదు. ఆ ట్రోలింగ్‌ను భరించలేక మా ఫ్యామిలీ గ్రూప్‌ మినహా అన్ని వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి నిష్క్రమించాం. వేలంలో యశ్ దయాల్‌ని బెంగళూరు రూ.5 కోట్లకు తీసుకున్నప్పుడు కూడా ట్రోల్ చేశారు. ఆర్సీబీ ఆ డబ్బును మురికి కాలువలో పడేసిందని విమర్శించారు’’ అని చందర్‌పాల్ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని